కొట్టి.. పడగొట్టి! ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

రాజ్‌‌కోట్‌‌: పరుగుల వరదగా మారిన రెండో వన్డేలో ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో సమష్టిగా రాణిస్తూ.. 36 రన్స్‌‌ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. టాస్‌‌ గెలిచి ఆసీస్‌‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 రన్స్‌‌ చేసింది. తర్వాత ఆసీస్‌‌ 49.1 ఓవర్లలో 304 రన్స్‌‌కు ఆలౌటైంది. స్టీవ్‌‌ స్మిత్‌‌ (102 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 98), లబుషేన్‌‌ (47 బంతుల్లో 4 ఫోర్లతో 46) రాణించారు. షమీ 3 వికెట్లు తీశాడు. రాహుల్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. సిరీస్‌‌ నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం బెంగళూరులో జరుగుతుంది.

శిఖర్‌‌ దంచెన్‌‌..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై ఆరంభం నుంచి ధవన్‌‌, రోహిత్‌‌.. ఆసీస్‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అద్భుతమైన డ్రైవ్స్‌‌తో ఆకట్టుకున్న శిఖర్‌‌.. దాదాపు 28.4 ఓవర్ల పాటు ఆసీస్‌‌ బౌలర్లను కంగారుపెట్టించాడు. గ్రౌండ్‌‌ నలుమూలలా షాట్లు బాదుతూ 60 బాల్స్‌‌లో ఆసీస్‌‌పై ఆరో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. రెండోఎండ్‌‌లో రోహిత్‌‌ నిలకడగా ఆడినా.. 14వ ఓవర్‌‌లో జంపా బాల్‌‌ను స్వీప్‌‌ చేయబోయి లైన్‌‌ మిస్సయ్యాడు. దీంతో తొలి వికెట్‌‌కు 81 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన కోహ్లీ మ్యాచ్‌‌ను మరో స్టేజ్‌‌కు తీసుకెళ్లాడు. కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో సూపర్‌‌ సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన కెప్టెన్‌‌ అవసరమైనప్పుడల్లా ఫోర్లు, ఆపై వేగంగా సింగిల్స్‌‌ తీస్తూ రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూశాడు. అగర్‌‌ వేసిన 25వ ఓవర్‌‌లో స్వీప్‌‌, రివర్స్‌‌ స్వీప్‌‌తో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధవన్‌‌.. 27వ ఓవర్‌‌లో ఓ ఫోర్‌‌, సిక్స్‌‌తో బౌలర్‌‌ను కుదురుకోకుండా చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న శిఖర్‌‌.. 29వ ఓవర్‌‌లో ఔటయ్యాడు. రిచర్డ్‌‌సన్‌‌ బంతిని ఫుల్‌‌చేయబోయి ఫైన్‌‌ లెగ్‌‌లో స్టార్క్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. రెండో వికెట్‌‌కు 103 రన్స్‌‌ సమకూరడంతో ఇండియా 184/2తో పటిష్ట స్థితిలో నిలిచింది.

రాహులో.. రాహుల్‌‌

స్లాగ్‌‌ ఓవర్లలో రాహుల్‌‌ ఆట.. ధవన్‌‌ దూకుడును మించిపోయింది. ఈ ఇద్దరి మధ్య సంధానకర్తగా వ్యవహరించిన కోహ్లీ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. మధ్యలో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (7) విఫలమైనా.. రాహుల్‌‌ కొట్టిన కొట్టుడుకు ఆసీస్‌‌ బౌలర్లు బేజారెత్తిపోయారు. అగర్‌‌, స్టార్క్‌‌, కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో మూడు స్టాండ్‌‌ ఔట్‌‌ సిక్సర్లు కొట్టిన రాహుల్‌‌.. కోహ్లీతో పోటీపడి రన్స్‌‌ చేశాడు. ఈ క్రమంలో విరాట్‌‌ (50 బాల్స్‌‌), రాహుల్‌‌ (38 బాల్స్‌‌) హాఫ్‌‌ సెంచరీలు పూర్తయ్యాయి. ఫలితంగా ఈ ఇద్దరూ కేవలం 63 బంతుల్లో 78 రన్స్‌‌ భాగస్వామ్యం నెలకొల్పారు. 44వ ఓవర్‌‌లో జంపా బాల్‌‌ను కోహ్లీ దాదాపుగా సిక్సర్‌‌ కొట్టాడు. కానీ బౌండరీ లైన్‌‌ వద్ద స్టార్క్‌‌ సూపర్‌‌ క్యాచ్‌‌ పట్టాడు. ఆరు బంతుల తేడాలో మనీశ్​ పాండే (2) ఔట్‌‌కాగా, జడేజా (20 నాటౌట్‌‌) మెరుగ్గా ఆడాడు. ఇన్నింగ్స్‌‌ ఆఖరి ఓవర్‌‌లో రాహుల్‌‌ అనూహ్యంగా ఔటైనా.. అప్పటికే ఇండియా స్కోరు 300 దాటిపోయింది.

స్మిత్‌‌ పోరాడినా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆసీస్‌‌ చాలా నిలకడగా ఆడింది. ఆరంభంలో బుమ్రా (1/32) చెలరేగినా.. రెండోఎండ్‌‌లో సహకారం కరువైంది. నాలుగో ఓవర్‌‌లోనే షమీ  దెబ్బకు వార్నర్‌‌ (15) ఔటైనా తర్వాతి వికెట్లు తీయడంలో ఆలస్యమైంది. చివరకు పవర్‌‌ప్లే తర్వాత జడేజా (2/58) రంగప్రవేశం చేయడంతో కొద్దిగా సీన్‌‌ మారినా.. వన్‌‌డౌన్‌‌లో స్మిత్‌‌ అడ్డుగోడలా నిలబడ్డాడు. స్మిత్‌‌తో రెండో వికెట్‌‌కు 62 రన్స్‌‌ జోడించి ఫించ్‌‌ (33) ఔట్‌‌కాగా, లబుషేన్‌‌  కూడా సమయోచితంగా స్పందించాడు. ఉన్నంతసేపు వీలైనన్నీ ఎక్కువ రన్స్‌‌ చేసిన లబుషేన్‌‌ హాఫ్‌‌ సెంచరీ మిస్‌‌ చేసుకున్నాడు. అయినా స్మిత్‌‌తో మూడో వికెట్‌‌కు 96 రన్స్‌‌ జతచేయడంతో ఇన్నింగ్స్‌‌లో పటిష్టత వచ్చింది. కుల్దీప్‌‌ (2/65) వేసిన 34వ ఓవర్‌‌లో క్యారీ (18) ఇన్నింగ్స్‌‌లో తొలి సిక్స్‌‌ బాదడంతో ఆసీస్‌‌ స్కోరు 200కు చేరింది. ఆ వెంటనే జడేజా బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపి స్మిత్‌‌ జోరు పెంచినా.. 38వ ఓవర్‌‌లో కుల్దీప్‌‌ డబుల్‌‌ మ్యాజిక్‌‌ చేశాడు. నాలుగు బంతుల తేడాలో క్యారీ, స్మిత్‌‌ను ఔట్‌‌ చేయడంతో మ్యాచ్‌‌ ఇండియా వైపు మొగ్గింది. ఓ సూపర్‌‌ డెలివరీని ఆడిన స్మిత్‌‌ ఇన్‌‌సైడ్‌‌ ఎడ్జ్‌‌తో  క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. దీంతో రెండు రన్స్‌‌ తేడాతో సెంచరీ మిస్‌‌ అయ్యాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే 44వ ఓవర్‌‌లో షమీ.. వరుస బంతుల్లో టర్నర్‌‌ (13), కమిన్స్‌‌ (1) వికెట్లు తీయడంతో ఆసీస్‌‌ పరుగుల వేటలో వెనుకబడింది. అగర్‌‌ (25), రిచర్డ్‌‌సన్‌‌ (24 నాటౌట్‌‌) వేగంగా ఆడినా చేయాల్సిన రన్‌‌రేట్‌‌ పెరిగిపోయింది.

లిమిటెడ్‌‌ ఓవర్స్‌‌లో కోహ్లీని అత్యధిక సార్లు (7) ఔట్‌‌ చేసిన తొలి బౌలర్‌‌ జంపా. వన్డేల్లో ఐదు, టీ20ల్లో రెండుసార్లు విరాట్‌‌ వికెట్‌‌ తీశాడు. రవి రాంపాల్‌‌ మాత్రం వన్డేల్లోనే కోహ్లీని ఆరుసార్లు ఔట్‌‌ చేశాడు.

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌‌ (137)లో 7 వేల రన్స్‌‌ చేసిన ఓపెనర్‌‌గా రోహిత్‌‌ రికార్డులకెక్కాడు. ఆమ్లా (147), సచిన్‌‌ (160) టాప్‌‌-3లో ఉన్నారు. వన్డేల్లో ఇండియా తరఫున 7 వేల రన్స్‌‌ పూర్తి చేసిన నాలుగో ఓపెనర్‌‌ రోహిత్. సచిన్‌‌, సెహ్వాగ్‌‌, గంగూలీ ముందున్నారు.

వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఇండియా స్పిన్నర్‌‌గా కుల్దీప్‌‌  యాదవ్‌‌ నిలిచాడు. కుల్దీప్‌‌ 58 మ్యాచ్‌‌ల్లో సెంచరీ మార్కు చేరితే హర్భజన్‌‌ సింగ్‌‌ 76 మ్యాచ్‌‌ల్లో ఈ ఫీట్‌‌ చేశాడు. ఓవరాల్‌‌గా మూడో ఫాస్టెస్ట్‌‌ బౌలర్‌‌గానూ కుల్దీప్‌‌ నిలిచాడు. షమీ(56), బుమ్రా(57)ఈ లిస్ట్‌‌లో టాప్‌‌లో ఉన్నారు.

Latest Updates