విమానం అల్లిన హరివిల్లు…

వర్షం వచ్చి వెలిసినప్పుడు ఆకాశం ఏడు రంగుల వంకీని వయ్యారంగా పెడతది. దాన్నే మనం హరివిల్లు అలియాస్​ ఇంద్రధనుస్సు అంటాం. ఇంగ్లిష్​లో అయితే రెయిన్​బో అంటాం. పేరు ఏదైతేనేం, అదే ఆకాశంలో ఓ విమానం హరివిల్లును అల్లితే ఎట్లుంటది? ఇదిగో ఈ ఫొటోలో చూపించినట్టు ఉంటుంది. అవును, ఇది నిజమే. విమానం వెళుతున్నప్పుడు దాని వెనకాల వచ్చిన ఇంద్ర ధనుస్సిది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్​కు చెందిన మైకేల్​ మార్​స్టన్​ అనే ఫొటోగ్రాఫర్​ ఈ హరివిల్లు విమానాన్ని తన కెమెరాలో పట్టేశాడు.

ఆకాశంలో ఖతార్​ విమానం దూసుకెళుతుండగా ఈ ఏడాది జూన్​లో దాన్ని ఒడిసిపట్టాడు. ఇంతకుముందూ ఇలాంటి ఫొటోలు అతడు తీసినా, వీడియో కూడా తీయడం ఇదే మొదటిసారి. విమానాలు అత్యంత ఎత్తులో వెళుతున్నప్పుడు ఒత్తిడి (పీడనం) తగ్గుతుందని, గాలిలో వేడి పడిపోతుందని, అప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయని జర్మన్​ ఏరోస్పేస్​ సెంటర్​కు చెందిన ఇనిస్టిట్యూట్​ ఆప్​ అట్మాస్ఫెరిక్​ సెంటర్​ సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే, నాసా సైంటిస్టులు దానికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. విమానం ఎగ్జాస్ట్​ (పొగ గొట్టాలు) నుంచి పొగ బయటకు వచ్చినప్పుడు చల్లటి గాలి ఏర్పడి మంచు స్ఫటికాలు పుడతాయని, ఆ స్ఫటికాలపై సూర్యుడి వెలుగు కరెక్ట్​ కోణంలో పడితే ఇలాంటి హరివిల్లులు ఏర్పడతాయని వాళ్లు చెబుతున్నారు.