సైంటిస్టుల హెచ్చరిక.. ఆరో ప్రళయం ఆరంభం

1999లో.. కలియుగం అంతమైతదన్నరు. కానీ ఏం కాలే! 2012లో.. ఈ సారి యుగాంతం తప్పదన్నరు. కానీ ఏం జరగలే! ప్రళయాలు సినిమాల్లోనే  వచ్చినయి తప్ప మన భూగోళానికి ఏమీ కాలే! అయితే మతాలు, విశ్వాసాలు, జ్యోతిష్యం పరంగా చెప్పే ప్రళయాల సంగతి పక్కన పెట్టి.. సైన్స్ పరంగా చూస్తే మాత్రం ఇప్పటికే ఐదు మహా ప్రళయాలు వచ్చాయని చెబుతుంటారు. కానీ ఆరో ప్రళయం కూడా ఆల్రెడీ మొదలైందని, ఈ సారి భూగోళంపై దాదాపు 90 శాతం పైగా జీవరాశులు అంతరించిపోతాయని తాజాగా ఆస్ట్రేలియన్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

షురువైంది..

భూమిపై 350 కోట్ల ఏండ్ల కిందట జీవులు ఏర్పడ్డాయట. భూమిపై జీవరాశుల సంఖ్య పెరగడానికి కోట్ల ఏండ్లు పడుతుండగా.. రెండు మిలియన్ ఏండ్లలోనే  మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్ జరుగుతోందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ ఐదు సార్లు మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్లు జరిగాయని, ఆ ఐదు సార్లూ భూమిపై ఉన్న అన్ని జీవుల్లో 75 శాతం నుంచి 90 శాతం వరకూ కనుమరుగైపోయాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. భూమిపై ఆరో మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్ కొనసాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.  భూమిపై గత 54 కోట్ల ఏండ్ల నుంచీ  ప్రతి10 కోట్ల ఏండ్లకు ఒకసారి చొప్పున 5 ప్రళయాలు (మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్స్)  వచ్చాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్స్ ఒక్కోటి కనీసం 50 వేల ఏండ్ల నుంచి 28 లక్షల ఏండ్ల పాటు కొనసాగాయని అంటున్నారు. అన్ని జీవుల్లో కనీసం 75% జీవులు చనిపోతాయట.

మనమే కారణం

ఇప్పటివరకూ భూమిపై జరిగిన ఐదు మాస్ ఎక్స్‌‌‌‌టింక్షన్లకు మంచుయుగం, ఆస్టరాయిడ్లు ఢీకొట్టడం, అగ్నిపర్వతాలు పేలడం వంటి ప్రకృతి విపత్తులు కారణమైతే ఇప్పటి పరిస్థితికి మాత్రం మనమే కారణమని రీసెర్చర్లు స్పష్టం చేస్తున్నారు. సహజ వనరులను విపరీతంగా వాడుకోవడం, అడవులను నాశనం చేయడం, ఎన్నో జాతుల జీవులకు నిలువ నీడ లేకుండా చేస్తుండటంతో ఇప్పటికే చాలా జాతుల జీవులు వేగంగా అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ సంక్షోభం ఏర్పడిందని, ఇది తీవ్రమవుతున్న కొద్దీ జీవులు అంతరించిపోయే వేగం పెరుగుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. 1500వ సంవత్సరం నుంచి వెన్నెముక ఉన్న జీవుల్లోనే ఇప్పటివరకూ 332 జాతుల జీవులు అంతరించిపోయాయట. అంటే ప్రతి రెండేళ్లకు ఒక వర్టిబ్రేట్ జాతి అంతరిస్తున్నదట. ఐయూసీఎన్ అంచనా ప్రకారం, ప్రస్తుతం 32% జాతుల జీవులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయట. ప్రస్తుతం ఒక్క ఆస్ట్రేలియాలోనే 300 జంతుజాతులు, 1000 వృక్ష జాతులు కనుమరుగైపోయే ముప్పు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నారు.

ఇవీ ఆ ఐదు ప్రళయాలు..

  1. ఫస్ట్ మాస్ ఎక్స్ టింక్షన్: 44 కోట్ల ఏండ్ల కిందట.. ఓర్డోవిసియన్ యుగం చివరలో జరిగింది. భూమి అంతా మంచుతో గడ్డకట్టుకుపోయి, సముద్రంలోని జీవులతో సహా దాదాపు 85% జీవులు అంతరించిపోయాయట.
  2. సెకండ్ మాస్ ఎక్స్ టింక్షన్: 37.4 కోట్ల ఏండ్ల కిందట.. డివోనియన్ యుగం చివరలో జరిగింది. 75% జీవులు చనిపోయాయట.
  3. థర్డ్ మాస్ ఎక్స్ టింక్షన్: 25 కోట్ల ఏండ్ల కిందట.. పెర్మియన్ యుగం కాలంలో జరిగింది. ఐదింటిలోనూ ఇదే అతిపెద్ద ప్రళయమని సైంటిస్టులు భావిస్తారు. 95% జీవులు అంతరించిపోయాయట.
  4. ఫోర్త్ మాస్ ఎక్స్ టింక్షన్: 20 కోట్ల ఏండ్ల కిందట.. జురాసిక్ యుగం కాలంలో జరిగింది. 80‌‌‌‌‌‌‌‌% జీవజాతులు నశించిపోయాయట.
  5. ఫిఫ్త్ మాస్ ఎక్స్ టింక్షన్: 14.5 కోట్ల ఏండ్ల కిందట.. క్రిటేషియస్ యుగం కాలంలో జరిగింది. మెక్సికో వద్ద భారీ ఆస్టరాయిడ్ ఢీకొట్టడం, ఇండియాలోని దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాల పేలుళ్ల వల్లే ఇది జరిగింది. 76% జీవులు అంతరించాయి.

Latest Updates