అడాల్ఫ్ హిట్ల‌ర్ మీమ్ తో ఊడిన ఉద్యోగం : రూ.కోటికి పైగా న‌ష్ట‌ప‌రిహారం

మీమ్ క్రియేట్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగికి అదృష్టం వ‌రించింది. ఏకంగా రూ.కోటీ 6 ల‌క్ష‌లు వ‌రించాయి.

ఆస్ట్రేలియాకు చెందిన స్కాట్ ట్రేసీ అని వ్య‌క్తి బీపీ అనే పెట్రోలియం సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే సోష‌ల్ మీడియాలో చిన్న‌చిన్న మీమ్స్ క్రియేట్ చేసి త‌న‌లోని టాలెంట్ ను బ‌య‌ట‌పెట్టేవాడు. ఆ టాలెంటే అత‌ని కొంప‌ముంచింది.

2019లో అడాల్ఫ్ హిట్లర్ మీమ్‌ను క్రియేట్ చేసిన త‌న ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ పై కంపెనీ యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విధుల‌నుంచి తొల‌గించింది.

దీంతో ట్రేసీ ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. త‌నకు న్యాయ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఫెయిర్ వ‌ర్క్ క‌మీష‌న్ ను ఆశ్ర‌యించాడు. ఉద్యోగం కోల్పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డాన‌ని, ఆ ఇబ్బందుల నుంచి త‌న‌ని గ‌ట్టెక్కించాల‌ని ఎఫ్‌డబ్ల్యూసీ ని విన్న‌వించుకున్నాడు. దీంతో విచార‌ణ చేప‌ట్టిన ఎఫ్ డ‌బ్ల్యూసీ బీపీ పెట్రోలియం కంపెనీకి ఆదేశాల్ని జారీ చేసింది. బాధితుడికి న‌ష్ట‌ప‌రిహారం కింద 1,43,000 డాలర్లు(రూ. కోటి 6 లక్షలు) చెల్లించాల‌ని సూచించింది. అంతేకాదు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మ‌ళ్లీ ఇవ్వాల‌ని నోటీసులు జారీ చేసింది.

ఎఫ్ డ‌బ్ల్యూసీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ బీపీ కంపెనీ ఫెడ‌ర‌ల్ కోర్ట్ ను ఆశ్ర‌యించింది. స‌ద‌రు పెట్రోలియం కంపెనీకి అక్క‌డ చుక్కెదురైంది. దీంతో దిగివ‌చ్చిన పెట్రోలియం సంస్థ ఉద్యోగికి పెద్ద‌మొత్తంలో ఇచ్చేందుకు అంగీక‌రించింది. తాజాగా తాము ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయంపై సమీక్ష జరుపుతున్నట్టు బీపీ సంస్థ ప్ర‌క‌టించింది. మరోవైపు ఆస్ట్రేలియన్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూయూ) కూడా ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థించింది.

Latest Updates