బాల్ ను శానిటైజ్ చేశాడని బౌలర్ పై సస్పెన్షన్!

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా క్రికెట్ తోపాటు చాలా స్పోర్టింగ్ కార్యకలాపాలు వాయిదా పడటంతో పాటు రద్దయ్యాయి. ఇప్పుడు నెమ్మదిగా పటిష్ట జాగ్రత్త చర్యల నడుమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ తిరిగి మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు తప్పనిసరిగా కరోనా సేఫ్టీ మెజర్స్ ను పాటించేలా చూస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలకూ వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఇంగ్లండ్ లో జరిగింది. క్రికెట్ బాల్ ను నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజ్ చేశాడనే కారణంతో వెటరన్ ఆస్ట్రేలియా సీమర్ మిచ్ క్లేడాన్ ను సస్పెండ్ చేశారు. గత నెలలో ఇంగ్లీష్ కౌంటీలో మిడిలెసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో మిచ్ బంతిని శానిటైజ్ చేశాడు. దీంతో సస్సెక్స్ టీమ్ కు ఆడుతున్న అతడ్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఈసీబీ విచారణకు ఆదేశించింది. ‘బాల్ పై హ్యాండ్ శానిటైజర్ వేసినందుకు గాను మిచ్ క్లేడాన్ మీద ఈసీబీ సస్పెన్షన్ విధించింది. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేం’ అని సస్సెక్స్ తమ వెబ్ సైట్ లో పేర్కొంది.

Latest Updates