నగలు, డబ్బు స్వాహా చేసిన ఆటోడ్రైవర్

  • ఈ నెల 8న ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన ప్యాసింజర్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు

ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ అందులో తన బ్యాగ్ మర్చిపోయింది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో గోల్డ్ చైన్, డబ్బు, మొబైల్ ఉండటంతో  ఆ మహిళ పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదురోజుల తర్వాత ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కానీ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులను, డబ్బును రికవరీ చేయలేకపోయారు. అప్పటికే  ఆ ఆటోడ్రైవర్ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గోల్డ్ చైన్ అమ్మేశాడు. అందులో ఉన్న డబ్బును ఖర్చుపెట్టాడు. దీంతో  పోలీసులు ఆటోడ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.

ఎస్సై సీహెచ్. శంకర్ కథనం ప్రకారం..ఈ నెల 8న హిమాయత్ నగర్ లో ఉంటున్న జి.మాధవి లక్డీకాపూల్ నుంచి తన ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఇంటికి చేరుకున్న తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ ను ఆటోలో మరిచిపోయినట్టు గ్రహించిన మాధవి అందులో డబ్బు, బంగారం ఉండటంతో మరుసటిరోజు నారాయణగూడ పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చింది. తాను ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ లో 3.5 తులాల గోల్డ్ చైన్, రూ.42వేల డబ్బు, ఓ స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు మాధవి తన కంప్లయింట్ లో పేర్కొంది.

కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు డీఐ ఎం. రవికుమార్ నేతృత్వంలో ఆ మహిళ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఆటో దిగిన సమయాన్ని బట్టి ఫుటేజ్ లో ఆటో ను గుర్తించారు. ఆటో నంబర్ సాయంతో  బి.బ్రహ్మం(48) అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు విచారించగా..హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డబ్బు, బంగారం వాడుకున్నట్టు చెప్పాడు. ఆటోడ్రైవర్ బ్రహ్మం దగ్గరి నుంచి స్మార్ట్​ఫోన్ ని మాత్రమే రికవరీ చేసిన పోలీసులు..అతడిని రిమాండ్ కి తరలించినట్టు చెప్పారు.

Latest Updates