అన్నిరకాల బండ్లకూ చోటుంది

  • ఆటో ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన మోడీ
  • ఆనందం వ్యక్తం చేస్తోన్న ఇండస్ట్రీ
  • పెట్టుబడులు పెరుగుతాయ్
  • ఉద్యోగాలు వస్తాయ్.. టీవీఎస్ ఛైర్మన్ వేణు

న్యూఢిల్లీ : సంప్రదాయ ఇంధన వాహనాలు(పెట్రోల్, డీజిల్‌‌తో నడిచే వాహనాలు), ఎలక్ట్రిక్ వాహనాలు రెండూ ఇండియాలో నడుపుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన భరోసాకు ఆటో ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తోంది. అసలుకే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న ఈ ఇండస్ట్రీ ప్రధాని ఇచ్చిన పిలుపును స్వాగతిస్తోంది. భవిష్యత్తులో పెట్టుబడుల ప్రోత్సాహానికి, ఉద్యోగాల సృష్టికి ఇదెంతో ఉపయోగపడుతుందని ఆటో ఇండస్ట్రీ ప్లేయర్స్ చెబుతున్నారు. బిజినెస్ డైలీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోడీ సంప్రదాయ ఇంధన వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌ రెండూ వృద్ధిని సాధించేందుకు అవసరమైన అతిపెద్ద మార్కెట్ తమకు ఉందని, దానికి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీ ఉంటుందని చెప్పారు. ఈ రెండింటిలో ఒక్కదానికే గ్రోత్ ఉంటుందనే ఊహాగానాలు అవసరం లేదన్నారు.

సప్లయి చైన్‌‌లో లక్షల మందికి  భరోసా…

సియామ్ ప్రతిపాదనలకు తగ్గట్టే ప్రధానమంత్రి హామీ ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ మానుఫాక్చరర్స్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా అన్నారు. ఇండియాలో అన్ని సంబంధిత టెక్నాలజీలు ఉండటం, సస్టైనబుల్ మొబిలిటీకి దోహదం చేస్తుందన్నారు. టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కూడా ఇదే మాదిరి అభిప్రాయం వ్యక్తం చేశారు. సంప్రదాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై  ప్రధానమంత్రి మోడీ ఇటీవల ఇచ్చిన క్లారిటీతో.. ఇండియా ఆటోమోటివ్ సెక్టార్‌‌‌‌లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సప్లయి చైన్‌‌లో లక్షల మందికి  భరోసా కల్పించినట్టైందని పేర్కొన్నారు. కాంపోనెంట్ మానుఫాక్చరర్స్ నుంచి ఒరిజినల్ ఇక్విప్‌‌మెంట్ మానుఫాక్చరర్స్, డీలర్స్, మెకానిక్స్, అసోసియేట్ పీపుల్స్  వరకు ఆటో ఇండస్ట్రీలో భాగమై ఉన్నారు. ప్రధాని ఇచ్చిన హామీ వీరందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో అన్ని ఆప్షన్లను ప్రోత్సహించడమే ఎంతో కీలకమని శ్రీనివాసన్ అన్నారు.

ఆటో ఇండస్ట్రీ కోలుకుంటుంది…

ఇటీవల కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రోత్సహిస్తూ.. డీజిల్, పెట్రోల్‌‌తో నడిచే వాహనాలపై అశ్రద్ధ వహిస్తున్నారు. దానికి తోడు ఆటో ఇండస్ట్రీకి అధిక జీఎస్టీ, బీఎస్ 6 నిబంధనలు, లిక్విడిటీ పెను భారంగా నిలుస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలన్నాయి. విక్రయాలు కూడా గత కొన్నినెలలుగా తగ్గిపోయాయి. లిక్విడిటీ పెంపు వంటి పలు చర్యల ప్రకటనలతో పాటు, మోడీ ఇచ్చిన ఈ క్లారిఫికేషన్.. ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్ట్‌‌మెంట్ డెస్టినేషన్‌‌లో మనదీ ఒకటిగా కొనసాగుతుందన్నారు. ప్రధాని ప్రకటన.. ఆటో ఇండస్ట్రీకి మరింత విశ్వాసాన్ని అందిస్తుందని, ప్రస్తుతం తగ్గిపోయిన అమ్మకాల నుంచి కోలుకునేలా చేయనుందని టోయోటా కిర్లోస్కర్ మోటార్ జాయింట్ ఎండీ ఎన్‌‌ రాజ చెప్పారు.ఈ క్లారిటీతో ఇప్పటి వరకు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చిన వినియోగదారులు ఇక ముందుకు రానున్నారని పేర్కొన్నారు. ఇది మార్కెట్‌‌ను మెరుగుపరిచేందుకు సహకరించనుందని తెలిపారు. కాగా, 2023 వరకు సాంప్రదాయ ఇంధనాలతో నడిచే త్రీ వీలర్స్‌‌, 2025 నాటికి అన్ని టూవీలర్స్‌‌ పూర్తిగా ఈవీల్లోకి మారిపోవాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆటో ఇండస్ట్రీ తీవ్రంగా వ్యతిరేకించింది.

Latest Updates