బండ్ల అమ్మకాలు స్లో!

Auto industry seeks govt support as PV sales see sharpest decline in 18 yrs
  • గత 18 ఏళ్లలో భారీగా తగ్గుదల
  • 20 శాతానికి పైగా  సేల్స్​ పతనం
  • ప్రభుత్వ సాయానికి ఇండస్ట్రీ వినతి
  • ఉత్పత్తికి కోత విధించినట్టు ప్రకటన

ప్యాసెంజర్ వెహికిల్ (పీవీ) సేల్స్‌‌ భారీగా పడిపోయాయి. గత 18  ఏళ్లలో తొలిసారి భారీ క్షీణతను నమోదు చేశాయి. ఏకంగా మే నెలలో ఈ సేల్స్ 20 శాతానికి పైగా తగ్గాయి. సేల్స్ పడిపోతుండటంతో, వాహన కంపెనీలు కూడా ఉత్పత్తిని బలవంతంగా తగ్గిస్తున్నాయి. గత నెల ప్యాసెంజర్ వెహికిల్  అమ్మకాలు 2,39,347 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 3,01,238 యూనిట్లుగా నమోదయ్యాయి. గత 11 నెలల్లో 10 నెలలు ప్రయాణికుల వాహనాల సేల్స్ నెగిటివ్‌‌గానే ఉన్నాయి. కానీ గత నెల విక్రయాలు మాత్రం 2001 సెప్టెంబర్ నాటి స్థాయులకు పడిపోయాయి. ఆ సమయంలో ప్యాసెంజర్ వెహికిల్ సేల్స్ 21.91 శాతం కిందకు జారాయి. టూవీలర్స్, కమర్షియల్ వెహికిల్స్ వంటి అన్ని సెగ్మెంట్లలో మే నెలలో విక్రయాలు తగ్గినట్టు సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మానుఫాక్చర్స్(సియామ్) డేటాలో వెల్లడైంది.

26 శాతం తగ్గిన కార్ల సేల్స్…

దేశీయ కారు విక్రయాలు గత నెలలో 26.03 శాతం తగ్గి 1,47,546 యూనిట్లకు పడిపోయాయి. 2018 మే నెలలో ఇవి 1,99,479 యూనిట్లు. మోటార్‌‌‌‌సైకిల్ సేల్స్‌‌ కూడా గత నెలలో 4.89 శాతం డౌన్ అయి 11,62,373 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఇవి కూడా గతేడాది ఇదే నెలలో 12,22,164 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం టూవీలర్స్ సేల్స్ మే నెలలో 6.73 శాతం క్షీణించి 17,26,206 యూనిట్లకు తగ్గిపోయాయి. కమర్షియల్ వెహికిల్స్ సేల్స్ కూడా 10.02 శాతం తగ్గి 68,847 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ పేర్కొంది.  అన్ని కేటగిరీల్లో వాహన విక్రయాలు 8.62 శాతం తగ్గి 20,86,358 యూనిట్లుగా రికార్డైనట్టు సియామ్ వెల్లడించింది. 2018 మే నెలలో ఈ విక్రయాలు 22,83,262 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. ‘ మే నెలలో కూడా వాహన విక్రయాల సేల్స్ తగ్గడం కొనసాగింది. హోల్‌‌సేల్స్‌‌తో పోలిస్తే రిటైల్ సేల్స్ గణాంకాలు కాస్త బాగున్నాయి. విక్రయాలు తగ్గుతుండటంతో, ఇండస్ట్రీ ఉత్పత్తి తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇన్వెంటరీ కరెక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. గత 15 ఏళ్లలో ఇంతలా పడిపోవడం మునుపెన్నడూ చూడలేదు’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు.

మార్కెట్‌‌లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించుకుని, వృద్ధి బాట పట్టించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2011–12, 2008–09 కాలంలో ఇండస్ట్రీ రికవరీ అయ్యేందుకు ప్రభుత్వం సాయం చేసిందని, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వంటి పలు పాలసీ చర్యలు తీసుకొచ్చిందని మాథుర్ తెలిపారు. అన్ని కేటగిరీలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని కోరుతున్నామని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. డిమాండ్‌‌ను పెంచడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

ఉత్పత్తికి కోత….

డిమాండ్ తగ్గడంతో మే నెలలో అన్ని సెగ్మెంట్లలో ఉత్పత్తి కోత 7.97 శాతానికి పెరిగింది. ఈ ఏడాది చివరి ఆరు నెలలో కాలంలో ఇండస్ట్రీ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని మాథుర్ చెప్పారు.  మారుతీ సుజుకీ పీవీ విక్రయాల్లో 25.06 శాతం క్షీణతను నమోదు చేసింది. గత నెలలో 1,21,018 యూనిట్ల పీవీలను అమ్మింది. దాని ప్రత్యర్థి హ్యుండై విక్రయాలు కూడా 5.57 శాతం తగ్గి 42,502 యూనిట్లుగా ఉన్నాయి. ఎంఅండ్ఎం సేల్స్ గత నెలలో 20,607 యూనిట్లకు తగ్గాయి.   హీరో బైక్ సేల్స్ గత నెలలో 7.89 శాతం తగ్గి 6,37,319 యూనిట్లుగా ఉన్నాయి. బజాజ్ ఆటో మాత్రం 6.84 శాతం వృద్ధిని నమోదు చేసింది. హోండా విక్రయాలు కూడా 11.4 శాతం తగ్గిపోయాయి.

Latest Updates