ఆటోవాలాలకు తప్పని మీటర్ సీలింగ్ తిప్పలు

గ్రేటర్​ హైదరాబాద్​లో ఆటో వాలాలు మీటర్ కు సీలింగ్ వేయించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలో మొత్తం లక్షా 30వేల ఆటోలుంటే మీటర్ సీలింగ్ వేసే కేంద్రాలు రెండే ఉన్నాయి. దాంతో సీలింగ్ కేంద్రాలకు వెళ్లిన ప్రతి ఆటో డ్రైవర్ గంటల తరబడి వెయిట్​చేయాల్సి వస్తోంది. తమ వంతు వచ్చే వరకు రోజుల సమయం పడుతోంది. క్యూ ఎక్కువగా ఉండటంతో వెళ్లిన రోజే పనికాని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా డ్రైవర్లు మళ్లీ మళ్లీ మీటర్ సీలింగ్ సెంటర్లకు తిరగాల్సి వస్తోంది. ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆ రోజు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆటోవాలాలు ఆవేదన చెందుతున్నారు. మీటర్ సీలింగ్ లో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో కొంతమంది సీలింగ్ లేకుండానే ఆటోలు నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి మీటర్  సీలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు గ్రేటర్ పరిధిలో రోజుకు 50 నుంచి 60 కొత్త ఆటోలు రోడ్డుపైకి వస్తుంటాయి. లక్షా 30 వేల మందితోపాటు రోజూ కొత్తగా వచ్చే ఆటోలతో మీటర్ సీలింగ్ కు మరింత సమయం పడుతోంది. ఏడాది గడిచిన వారు, కొత్తగా వచ్చే ఆటోలతో రోజూ వందల సంఖ్యలో ఆటోలకు మీటర్ సీలింగ్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది.

తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో…

ఆటోల మీటర్ కు సీలింగ్ వేసే బాధ్యత రవాణా శాఖ పరిధిలో కాకుండా తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఆటో మీటర్ సీలింగ్ కు కావాల్సినన్నీ కేంద్రాలు ఈ శాఖ పరిధిలో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్టాఫ్ తక్కువగా ఉండడం మరింత జాప్యానికి కారణమవుతోంది. సైదాబాద్ లోని సింగరేణి కాలనీ, అత్తాపూర్ లో మరో కేంద్రంలో మాత్రమే ఆటో మీటర్లకు సీలింగ్ వేస్తుంటారు. ఒక్క ఆటో మీటర్ కు సీలింగ్ వేయాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడిపి చెక్ చేయాలి. కానీ ఈ కేంద్రాల వద్ద సరిపడే స్థలం లేకపోవటంతో ప్రమాణాలు పాటించకుండానే కార్యక్రమం ముగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆటోల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని మీటర్ సీలింగ్ కేంద్రాలు పెంచాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కూకట్ పల్లి, బాలానగర్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వారు మీటర్ సీలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు.

పనిచేయని కేంద్రాలు…

గ్రేటర్ పరిధిలో రెండే మీటర్ సీలింగ్ కేంద్రాలుండగా అవి కూడా తరచూ మూసి వేస్తున్నారు. ఏటా ఆటో డ్రైవర్లు తమ ఆటో ను ఫిట్ నెస్ చేయించాలంటే సీలింగ్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలి. సీలింగ్ కేంద్రాలు మూసి ఉండటంతో ఫిట్ నెస్ కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లే విషయంలో డ్రైవర్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఫిట్ నెస్ , మీటర్ సీలింగ్ లేకుండా రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు బాదుతున్నారు. సీలింగ్ కోసం వేచిచూడాలంటే రోజుకు రూ.800 వరకు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.