కారు కొనాలంటే ఇదే చాన్స్​

  • కంపెనీల డిస్కౌంట్ల బాట   
  • డిమాండ్‌‌ లేక ధరల తగ్గింపు
  • పండగ సీజన్‌‌పై ఎన్నో ఆశలు

ముంబై: ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా 20 నెలలుగా వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ప్లాంట్లను మూసేసి ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. డీలర్లు లక్షల మంది ఉద్యోగులను తొలగించారు. ఇక నుంచి కూడా డిమాండ్‌‌ తక్కువే ఉంటుందని సియామ్‌‌ వంటి సంస్థలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్టాకులను వదిలించుకోవడానికి ధరల తగ్గింపే పరిష్కారమని ఆటోమొబైల్‌‌ కంపెనీలు భావిస్తున్నాయి. పైగా ఇది పండగ సీజన్‌‌ కాబట్టి డిస్కౌంట్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చని నమ్ముతున్నాయి. అందుకే కారు, బైకుల, ట్రక్కుల కంపెనీలు మునుపు ఎన్నడూ లేనన్ని డిస్కౌంట్లు ప్రకటించాయి. సాధారణంగా ఆటో కంపెనీలు 5–7 శాతం మధ్య తగ్గింపు ఇస్తాయి. ఈ ఏడాది ప్యాసింజన్‌‌ వెహికిల్స్‌‌ ఏకంగా 29 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించాయి. ట్రక్కుల అమ్మకందారులు 25 శాతం వరకు తగ్గిస్తున్నారు.

మారుతీ డిస్కౌంట్ల జోరు..

ఆటోరంగంలో మార్కెట్‌‌ లీడర్ మారుతీ సుజుకీ మోడల్‌‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్​–షోరూం ధరపై) తగ్గించింది. హ్యుండై గ్రాండ్‌‌కు 15 శాతం డిస్కౌంట్‌‌ ఇస్తుండగా, మారుతీ ఆల్టో ధరను 20 శాతం తగ్గించారు. ఇక నుంచి ‘బీఎస్‌‌–6’ స్టాండర్డ్‌‌ వాహనాలను అమ్మాలి కాబట్టి బీఎస్–4 మోడల్స్‌‌పై డిస్కౌంట్లు ఇస్తున్నామని కంపెనీ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ శశాంక్‌‌ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు బాగా పెరిగాయన్నారు. బీఎస్‌‌–6 స్టాండర్డ్‌‌ ఇంజన్‌‌తో మారుతీ తీసుకొచ్చిన ఏడు మోడల్స్‌‌పైనా డీలర్లు డిస్కౌంట్లు ఇస్తున్నారు. పండగ సీజన్‌‌ హడావుడి అక్టోబరు, డిసెంబరులో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల్లో డిస్కౌంట్లు ఎక్కువ. అయితే స్టాక్స్‌‌ను తొలగించుకోవడానికి ఆటో కంపెనీలు ఆగస్టు నుంచి డిస్కౌంట్లకు తెరతీశాయని హ్యుండై ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. యారిస్‌‌ వంటి ఎస్‌‌యూవీల స్టాక్‌‌లను తగ్గించడానికి టొయోటా ఏకంగా దీని ధరను రూ.2.50 లక్షలు తగ్గించింది. హోండా కూడా మోడల్స్‌‌ను బట్టి రూ.42 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రిబేట్లు ఇస్తోంది. సీఆర్‌‌వీ ఎస్‌‌యూవీ ధరను బాగా తగ్గించింది. రెనాల్ట్‌‌ క్యాప్చర్‌‌ ధరను, నిస్సాన్‌‌ తన కిక్స్‌‌ మోడల్‌‌ ధరను రూ.1.5 లక్షల చొప్పున తగ్గించేశాయి. బీఎస్‌‌–4 వాహనాలు అమ్ముడుపోకుంటే వాటిని తుక్కుగా మార్చాల్సి ఉంటుంది కాబట్టే అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అంతేకాదు ఫైనాన్స్‌‌తో కాకుండా నగదు పెట్టి కొంటే అదనంగా రూ.1,500 వరకు డిస్కౌంట్‌‌ ఇస్తున్నారు.

Latest Updates