ఆకాశం తాకేలా అవెంజర్స్ క్రేజ్!

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతం. సాధారణంగా పెద్ద సినిమాల విడుదలప్పుడు, వీకెండ్స్ లో మాత్రమే ఐమాక్స్ దగ్గర జనం గుంపులుగా కనిపిస్తారు. కానీ, నిన్న (బుధవారం) ఉదయం ఐమాక్స్ పక్కన దాదాపు అర కిలోమీటరు వరకు పెద్ద క్యూ కనిపించింది. పక్కనుంచి వెళ్తున్నజనం అంతపెద్ద క్యూ ఎందుకా అని ఆసక్తిగా చూశారు. అక్కడి క్యూలో నిలబడి తోసుకుంటున్న వాళ్లలో ఓ కుర్రాడ్ని ఒక పెద్దాయన అడిగితే చెప్పాడు.. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ టిక్కెట్ల కోసమని. అప్పుడు తెలిసింది ఆయనకు ఈ సినిమాకు ఎంత  క్రేజుందో.

‘అవెంజర్స్ ఎండ్ గేమ్’

క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగానే కాదు..దేశంలోని సినిమా లవర్స్ అంతా ఆసక్తిగాఎదురు చూస్తున్న మూవీ ఇది. రేపు (శుక్రవారం)విడుదల కానున్న ఈ సినిమా టిక్కెట్లకోసం యూత్ మల్టీప్లెక్సుల దగ్గర బారులు తీరుతున్నారు. గతంలో ఏ సినిమాకూ లేనంత క్రేజ్ ఇప్పుడు అవెంజర్స్.. దక్కించుకుంది.‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ తో గత సినిమాల రికార్డులన్నీ బద్దలవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. కొన్నేళ్లుగా హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో ఆదరణ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కానీ అది మరీ ఈ స్థాయిలోఉందా! అని ఆశ్చర్యపోయేలా చేసింది ఈ మూవీ. ఆన్ లైన్ మూవీ టిక్కెట్ యాప్స్ లోబుకింగ్ ప్రారంభించడం ఆలస్యం మొత్తం టిక్కెట్లు గంటల వ్యవధిలో అమ్ముడై పోయాయి.ముఖ్యంగా సినిమాలకు ‘ఏ’ సెంటర్స్ గాచెప్పుకునే మహానగరాల్లో అయితే అవెంజర్స్..కు టిక్కెట్లే దొరకడం లేదు.

మిలియన్ టికెట్లు

మంగవారం కల్లా ఒక్క రోజులోనే మిలియన్పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ‘బుక్మై షో’ యాప్ లో సెకనుకు పద్దెనిమిది టిక్కెట్లు అమ్మినట్లు సంస్థ వెల్లడించింది.దాదాపు పదేళ్లక్రితం విడుదలైన ‘అవతార్’మాత్రమే మన దేశంలో భారీ క్రేజుతో విడుదలైన హాలీవుడ్ సినిమాగా నిలిచింది.అంచనాలకు మించి సినిమా ఉండటంతో‘అవతార్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ‘జంగిల్ బుక్,అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ లాంటి అనేకసినిమాలొచ్చి విజయం సాధించినా అవెంజర్స్ ఎండ్ గేమ్ తరహాలో విడుదలకుముందు ఇంత క్రేజ్ సొంతం చేసుకోలేదు.ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ కారణంగా అవతార్ తర్వాత ‘అవెంజర్స్..’అంతటి క్రేజ్ దక్కించుకుంది. వేసవిసెలవులు కావడం, విద్యార్థులకు చాలావరకు అకడమిక్ పరీక్షలు ముగియడం ఈసినిమా క్రేజ్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు .

రికార్డుల మోత

దేశంలో స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే అనేక రికార్డుల్ని అవెంజర్స్ కొల్లగొడుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ గా చెప్పుకునే ఆమిర్ఖాన్, సల్మాన్ ఖాన్ లకు, ప్రాంతీయ భాషల్లో చిరంజీవి, రజనీకాంత్, విజయ్ వంటి హీరోలకు మాత్రమే మొదటి రోజు వసూళ్లు నలభై కోట్ల వరకు ఉంటాయి. అయితే ఇప్పటివరకు అమ్ముడైన టిక్కెట్ల దృష్ట్యా అవెంజర్స్ కూడా తొలి రోజు నలభై కోట్ల రూపాయల వరకువసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనావేస్తున్నారు. శని, ఆది వారాలకు కూడా బుకింగ్స్ జరిగాయి. దీంతో మొదటి వీకెండ్ కల్లా ఈజీగా వంద కోట్ల మార్కు దాటుతుందని అంచనా.పెద్ద హీరోల చిత్రాలు మాత్రమే వెయ్యి నుంచి రెండు వేల థియేటర్లలో విడుదల చేస్తుంటారు.అవెంజర్స్ కూడా దేశంలో దాదాపు 2,600స్క్రీన్స్ పై విడుదల చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటుతెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడావిడుదలవుతున్నాయి. స్టార్ హీరోల మూవీస్మాత్రమే ఫ్యాన్స్ అర్ధరాత్రి స్పె షల్ షోలువేసుకుని చూస్తుంటారు. ఇప్పుడు ఆ ఘనతకూడా ఈ మూవీ సాధించనుంది. సాధారణంగా హాలీవుడ్ మూవీస్ ఉదయం ఆటతో ప్రారంభమవుతాయి. కానీ, ముంబైలో గురువారంఅర్ధరాత్రి తర్వాతే మొదటి షో పడనుంది. ముంబైవడాలాలోని కార్నివాల్ ఐమాక్స్ లో రాత్రి మూడున్నరకే స్పెషల్ షో వేస్తున్నారు. ఇంకా చాలా నగరాల్లో ఉదయం ఎనిమిదింటికే షోలు ప్రారంభిస్తున్నారు.

మూడు గంటల నిడివి

హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా గంటన్నర నిడివితోనే రూపొందుతాయి. కొన్ని సినిమాలు రెండున్నర గంటలుంటాయి. కానీ, అవెంజర్స్ఎండ్ గేమ్ మాత్రం ఏకంగా మూడు గంటల ఒకనిమిషం నిడివితో వస్తోంది. మన ప్రేక్షకులకు ఎక్కువ నిడివి ఉండే సినిమాలు చూడటం అలవాటే కానీ, మరీ మూడు గంటలు సినిమాచూడ గలుగుతారా అనేది ఆసక్తికరంగా ఉంది.పైగా చాలా చోట్ల 3డీలో విడుదలవుతోంది.కాబట్టి అంతసేపు కళ్లద్దాలు పెట్టుకోవడం కూడాకొంచెం కష్టమైన విషయం. మరి అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే రేపటి వరకుఆగాల్సిందే.

కలిసొచ్చిన ప్రచారం

ఈ సినిమా విడుదలకు దాదాపు నెల రోజులముందు నుంచి ప్రచారం నిర్వహించారు. స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఈ మూవీకోసం ప్రత్యేకంగా ‘అవెంజర్స్ ఆంథమ్’రూపొందించాడు. దగ్గుబాటి రానా, విజయ్ సేతుపతి, ఆండ్రియా వంటి నటులు పలుపాత్రలకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా ప్రచారకార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు జో రస్సో కొద్ది రోజులు మన దేశంలోని పలునగరాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించాడు.భారీ స్థాయిలో ప్రచారం చేయడంతో మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇతర సినిమాలకు దెబ్బేనా?

‘అవెంజర్స్..’ భారీ స్థాయిలో విడుదలవుతుండటంతో ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై పడే అవకాశం ఉంది. ఇటీవల హిందీ లో భారీ అంచనాల మధ్య విడుదలై,అంతంత మాత్రంగా ఆడుతున్న ‘కళంక్’పై అవెంజర్స్ ప్రభావం చూపిస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం. తెలుగుతోపాటు, ఇతర ప్రాంతీయ భాషా సినిమాలపైనా దీని ప్రభావం ఉంటుంది. ‘ఏ’ సెంటర్స్ లో, మల్టీప్లెక్సుల్లో ఎక్కువ షోలు ఈ మూవీకే ఇస్తున్నారట. ఇంకేముంది ఈ మూవీ సక్సెస్ సాధిస్తే ఇతర మూవీస్ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.

బాహుబలి తర్వాత

ఇటీవలి కాలంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘బాహుబలి’ మాత్రమే.రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో మొదటి రోజు షో చూసేందుకు  ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. హైదరాబాద్ లో మొదటి రోజు మాత్రమే కాకుం డా వీకెండ్ వరకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సిటీ సెంటర్లో ఉన్న ఐమాక్స్ దగ్గర ఈ సినిమా విడుదల సమయంలో భారీ క్రేజ్ నెలకొంది. ఆన్ లైన్ లో టిక్కెట్లు లేకపోవడంతో అభిమానులంతా  ఐమాక్స్ కు క్యూ కట్టా రు. దీంతో కిలో మీటరు వరకు పెద్ద క్యూ ఏర్పడింది. ఇది అప్పట్లో ఓ సంచలనం. మళ్లీ ఆ తర్వాత ఏ మూవీకి అంతటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ‘అవెంజర్స్’కు  బాహుబలి స్థాయిలో కాకపోయినా  ఐమాక్స్ దగ్గర బుధవారం ఉదయం భారీ క్యూనే  కనిపించింది. యూత్ టిక్కెట్ కౌంటర్ దగ్గర బారులు తీరి, గంటల తరబడి వేచి చూసి మరీ టిక్కెట్లు కొనుక్కున్నారు.

 

Latest Updates