ప్లాస్టిక్‌ సీసాల్లోని ఫుడ్: కడుపులో బిడ్డకు కష్టం!

  • ప్లాస్టిక్‌ సీసాల్లో, రేకు డబ్బాల్లో ప్యాకింగ్‌ చేసి అమ్మే ఫుడ్‌ ఆ బిడ్డకు మంచిది కాదు!

ఆహార తయారీలో రోగాలకు కారణమయ్యే రసాయనాలు చేరుతున్నాయంటే, ఇప్పుడు నిల్వ చేసే విధానాల వల్ల ఇంకొన్ని రసాయనాలు తోడవుతున్నాయి. ముఖ్యంగా క్యాన్‌ లలో నిల్వ ఉంచే ఆహార పదార్థాలలో ఇండస్ట్రియల్ కెమికల్‌ బిస్ఫెనోల్‌ ఏ (బీపీఏ) చేరుతోంది. ఇది మన శరీర ధర్మాన్ని నియంత్రించే వినాళ గ్రంథులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావంతో ఆయా గ్రంథుల పనితీరులో సమస్యలొస్తాయని ఇంతకు ముందే కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. దీని ప్రభావం వల్ల మహిళలు గర్భ సంబంధమైన (గైనిక్‌ ) సమస్యలను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కాబోయే తల్లులందరూ కలలు కంటారు. పిండం ఎదుగుదల కోసం తల్లికి వైద్యులిచ్చే మందులే కాకుండా వాళ్లు చెప్పిన ఆహార నియమాలన్నీ పాటిస్తారు. ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం రోజూ తీసుకోమంటారు. డాక్టర్లు చెప్పారు కదా అని ఇష్టం ఉన్నా, లేకున్నా ఆహార నియమాలు పాటిస్తాటారు. కానీ ఈ ఆహారం వల్ల ఆశించే ప్రయోజనాలు ప్లాస్టిక్‌ డబ్బాల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఉండదట.

ఎందుకు?

ఫుడ్‌ క్యాన్‌ (డబ్బా) తయారు చేసిన తర్వాత దానిపై బీపీఏ పూత వేస్తున్నారు. పానీయాలు, పాల పదార్థాలు, పిండి మొదలైన వాటిని ప్యాక్‌ చేసి అమ్మే క్యాన్‌ లు (డబ్బాలు), ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పై బైసోఫినాల్‌ ఏ (బీపీఏ)’ పూత ఉంటోంది. ‘బైసోఫినాల్‌ ఏ’ ఆర్గానిక్‌ సింథటిక్‌ సమ్మేళనం. ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో దీనిని ఉపయోగిస్తారు.

ఏమవుతుంది?
గర్బిణీలు ఇలాంటి ఆహారం తీసుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండరని, ఆ తర్వాత సంతానం కలగకపోవడం, గర్భాశయ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు బోస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. విశ్వవిద్యాలయానికి అనుబంధ ‘బూస్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ’ బీపీఏ, గర్బాశయ సమస్యలపై గతేడాది అధ్యయనం చేపట్టింది. 2018లో 2000 మెడికల్ ప్రిస్క్రిప్షన్లను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. వైద్యులను సంప్రదించే గర్భిణుల సమస్యలు, వాళ్ల ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు. క్యాన్‌ ఫుడ్‌ తీసుకునే గర్బిణులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారని వాళ్లు గుర్తించారు. బీపీఏ మూలంగా వినాళ గ్రంథుల్లో వచ్చే సమస్యల వల్ల పిండానికి హాని జరుగుతున్నట్లుగా ఈ అధ్యయనంలో గుర్తించామని బోస్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న శృతి మహా లింగయ్య పేర్కొంది. బీపీఏ పిండం ఎదుగుదలపైనే కాకుండా గర్భిణి ఆరోగ్యం పై, మహిళల పునరుత్పత్తి వ్యవస్థ సంతానం పొందే సామర్థ్యాన్ని కలిగి ఉండే జీవిత కాలం పైనా ప్రభావం చూపుతుందని, గర్బసంచిలో నీటి బుడగలు ఏర్పడటం (పీసీఓఎస్‌), అబార్షన్‌, నెలల నిండక ముందే ప్రసవించడం వంటి సమస్యలను మహిళలు ఎదుర్కొవాల్సి వస్తోందని శృతి అంటోంది.

పరిష్కారం ఏమిటి?
వినాళ గ్రంథులపై ప్రతికూల ప్రభావం చూపే రసాయనాల పట్ల అవగాహన కలిగి ఉండటం. మార్కెట్లో వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే వాటిని కొనుగోలు చేయడం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లో బీపీఏ ఉన్న రసాయనాలు, పదార్థాలను వాడకుండా చేయడమే పరిష్కార మార్గాలని అధ్యయనం సూచిస్తోంది.

 

Latest Updates