అయోధ్య కేసులో ముగిసిన వాదనలు.. సుప్రీం తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో రామజన్మ భూమి – బాబ్రీ మసీదు (అయోధ్య  కేసు) వివాదం కేసుకు సంబంధించిన వాదనలు ముగిశాయి. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనం ఎదుట వరుసగా 40 రోజుల పాటు లాయర్లు వాదనలు వినిపించారు. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేస్తున్న బెంచ్ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని చెప్పింది. లాయర్లు గంట ముందుగానే తమ వాదనలకు ముగింపు చెప్పారు.

పిటిషనర్లందరి వాదనలను విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరో మూడు రోజుల పాటు రాతపూర్వక వాదనలను ఫైల్ చేసే అవకాశం ఇచ్చింది. వీటన్నింటినీ పరిశీలించాక మరో 23 రోజుల్లోనే తీర్పును ఇవ్వనుంది.

మధ్యవర్తిత్వం విఫలం

వాస్తవానికి కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా పిటిషనర్లందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వచ్చేందుకు సుప్రీం కోర్టు అవకాశం కల్పించింది. కానీ ఈ మధ్యవర్తిత్వానికి నియమించిన కమిటీ అన్ని పార్టీలను ఏకాభిప్రాయంతో వివాదాన్ని ముగించడంలో విఫలమైంది. దీంతో ఆగస్టు 6 నుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని రాజ్యంగ ధర్మాసనం రోజు వారీ విచారణ ప్రారంభించింది.

డెడ్ లైన్ కి ముందే

నవంబరు 17న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ రిటైర్ అవ్వబోతున్నారు. ఆలోపే తీర్పు వెల్లడిస్తామని కోర్టు గత నెలలోనే ప్రకటితంచింది. ఇందులో భాగంగానే అక్టోబరు 18 కల్లా వాదనలు పూర్తి కావాలని డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. అనుకున్నట్లుగానే గడువుకు రెండ్రోజుల ముందుగానే వాదనలు ముగిశాయి.

మూడు ముక్కల తీర్పుపై విభేదించి..

అయోధ్య రామజన్మ భూమికి సంబంధించి మొత్తం 62 ఎకరాలు ఉండగా.. అందులో 2.77 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే వివాదం నడుస్తోంది. ఈ వివాదాస్పద భూమిని మూడు ముక్కలుగా విభజించి ప్రధాన పిటిషనర్లయిన రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిరోమా అఖారాలకు సమానం ఇవ్వాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై పిటిషనర్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 14 మంది పిటిషన్లరు సుప్రీం కోర్టులో దీనిపై రివ్యూ పిటిషన్లు వేశారు. ఎట్టకేలకు ఈ కేసు ఓ కొలిక్కి రాబోతోంది.

Latest Updates