అయోధ్య తీర్పుపై సుప్రీం కోర్టులో తొలి రివ్యూ పిటిషన్ ఫైల్

అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మొదటి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఏ హింద్ సంస్థ 217 పేజీల రివ్యూ పిటిషన్ ఇవాళ సుప్రీం కోర్టులో ఫైల్ చేసింది. బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని రామాజన్మ భూమిగా గుర్తిస్తూ అక్కడ ఆలయ నిర్మాణం చేయాలని సుప్రీం ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయని ఈ సంస్థ పేర్కొంది.

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణానికి వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది కోర్టు. ఆ తీర్పును శిరసావహిస్తామని చెప్పిన సున్నీ వక్ఫ్ బోర్డు 5 ఎకరాల భూమి తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ కేసులో ఇక రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని స్పష్టం చేసింది.

రివ్యూ వేయడం మా హక్కు

అయితే మెజారిటీ ముస్లింలు సుప్రీం తీర్పుపై అసంతృప్తితో ఉన్నారని, అతి కొద్ది మంది మాత్రమే రివ్యూ వద్దని చెబుతున్నారని జమైత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా ఆర్షద్ చెప్పారు. తీర్పుపై రివ్యూ కోరడమన్నది న్యాయపరంగా ఉన్న హక్కు అని, అందుకే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని తెలిపారాయన. గుడిని కూల్చి మసీదు కట్టినట్లు నిరూపించే ఆధారాలు లేవని చెప్పిన సుప్రీం అందుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అర్థం కాకుండా ఉంది కాబట్టే రివ్యూ కోరుతున్నామని చెప్పారు మౌలానా అర్షద్.

MORE NEWS:

అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం కడతాం: రాజ్‌నాథ్

ఆర్టీసీలో రెండేళ్లు నో యూనియన్స్.. ముందు పని చేయాలే

మరోవైపు అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అయోధ్య తీర్పు విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 9లోపు తాము పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు ఈ సంస్థ తరఫు లాయర్.

Latest Updates