దీపావళి స్పెషల్: అయోధ్యలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

అయోధ్య నగరం ఇవాళ(శనివారం) రాత్రి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. దీపావళి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అయోధ్య నగరంలో ఇవాళ దీపోత్సవానికి ఏర్పాట్లు చేసింది. 5.51లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొననున్న అయోధ్య దీపోత్సవం ఉదయం ఊరేగింపు ప్రారంభమైంది. సాకేత్ కాలేజీ నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు. దీపావళి సందర్భంగా శనివారం రాత్రి చేపట్టనున్న దీపోత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది.  అయోధ్య దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

Latest Updates