ఇక అభివృద్ధి దిశగా అయోధ్య…హిందూ ముస్లిం.. భాయీభాయీ

సరయూ తీరంలో.. అయోధ్య నగరంలో.. కొత్త పొద్దు పొడిచింది. మతాల హద్దులు దాటి హృదయాలు పెనవేసుకున్నాయి. శతాబ్దానికిపైగా సాగుతున్న వివాదానికి తెరపడటంతో ముంగిళ్లలో ఆనందాల సింగిడి పూలు పూస్తున్నాయి. ఎటుచూసినా రామనామ జపాలు.. అలయ్​ బలయ్​లే!  ఆలయం.. అయోధ్య అభివృద్ధి.. ఇప్పుడు అక్కడి ఏ గడపను తట్టినా, ఏ ఒక్కరిని కదిపినా ఇదే నినాదం. సుప్రీం తీర్పు తర్వాత తొలిరోజు అయోధ్యలో పరిస్థితిపై ‘వెలుగు’ ప్రతినిధి గ్రౌండ్​ రిపోర్ట్​..

 అయోధ్య నుంచి వెలుగు ప్రతినిధి:

ఇన్నాళ్లూ ఉద్వేగాలు, ఉద్రిక్తతల మధ్య బతికిన అయోధ్య వాసులు సుప్రీం తీర్పుతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇక్కడి ప్రతి వ్యక్తి నిర్బంధాల నుంచి బయటపడి ప్రశాంతత దొరికినట్లు భావిస్తున్నారు. 2.77 ఎకరాల భూ వివాదంపై తుది తీర్పు వచ్చిన మరుసటిరోజు ఆదివారం నగరవాసులు ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. 60 శాతానికిపైగా షాపులు, హోటళ్లు తెరుచుకున్నాయి. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. రోజువారీగా రాముడికి జరిగే నిత్య పూజా కార్యక్రమాలు, నైవేద్యాల్లో ఎలాంటి మార్పు లేదు. మొదట హనుమాన్ గడీని దర్శించుకొని, అటుతర్వాత  రామచంద్రుడ్ని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకపోకలకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇరుకు గల్లీల గుండా ఆలయానికి చేరుకోవాల్సి వస్తోంది.

తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి

సుప్రీం తీర్పు నేపథ్యంలో అయోధ్యలోని పలు చోట్ల పారా మిలిటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. పోలీసులు భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే  ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. కెమెరాలు, మొబైల్స్, పర్సులు, పైసలు, పెన్నులు ఇలా ఏ వస్తువునూ లోపలికి తీసుకెళ్లనీవడం లేదు.  ఏ కొంచెం అనుమానం వచ్చినా గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు వాహనాలను నిషేధించారు. ఈ నేపథ్యంలో రైళ్ల ద్వారా అయోధ్యకు చేరుకున్న భక్తులు కొన్ని కిలో మీటర్ల మేర కాలి నడకనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయినా వారిలో  ఏ మాత్రం అసహనం కనిపించలేదు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, భగవంతుడి దర్శనం కోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తామని సంతోషంగా చెప్పారు. మరోవైపు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం కూడా సరయూ నది ఒడ్డున గంగా హారతిని నిర్వహించారు.

హిందూ ముస్లిం.. భాయీభాయీ

అయోధ్యలో ఆదివారం పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. సాధు, సంతులతో కలిసి పలువురు ముస్లిం పెద్దలు సంబరాలు జరుపుకున్నారు. అలయ్​ బలయ్​ తీసుకున్నారు. 134ఏండ్ల వివాదానికి తెరపడినందుకు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇకపై వివాదాలకు అయోధ్య ఏ మాత్రం కేంద్ర బిందువు గా నిలవదని వారు అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా అయోధ్య నిలుస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. అయితే, ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అందులో మసీద్ ను నిర్మించుకొని ప్రార్థనలు చేసుకుంటామని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో అసదుద్దీన్​కు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి నేల పరమత సహనానికి నెలవని, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి కొన్ని ఘటనలు బాధించినప్పటికీ సుప్రీం తీర్పుతో అయోధ్య ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని అంటున్నారు.

ఆలయం.. అభివృద్ధి

2.77 ఎకరాల వివాదాస్పద భూమి రామ్​లల్లా(రాముడి)కే చెందుతుందని సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఆనందంలో ఉన్న స్థానికులు  ఇప్పుడు మందిర నిర్మాణపై దృష్టి సారిస్తున్నారు. అయితే, ఇన్నాళ్లు అయోధ్య అభివృద్ధికి దూరంగా ఉందని, ఇక నుంచి అభివృద్ధికి దారులుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంతోపాటు అయోధ్య అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మతాలకతీతంగా స్థానికులు చెబుతున్నారు. రామ మందిరం నిర్మాణంతో దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అయోధ్య నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ ఒక్కరి విజయమో.. ఏ ఒక్కరి ఓటమో కాదని అంటున్నారు.

ఒక్క రోజులో ఎంత మార్పు

నిన్న మొన్నటి వరకు 144 సెక్షన్, నిషేధాజ్ఞలు.. కానీ ఒక్కరోజులోనే పరిస్థితి అంతా మారిపోయింది. ఏం జరుగుతుందోనని భయపడిన స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం సుప్రీం తీర్పు తర్వాత మొదలైన సంబురాలు ఆదివారం కూడా కనిపించాయి. భక్తులంతా ఉదయం నుంచే వివిధ ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. హనుమాన్ గడీ, నయా ఘాట్ వద్ద రద్దీ కనిపించింది.

షాపులన్నీ బిజీబిజీ..

దేవాలయాల దగ్గర ఉన్న షాపులన్నీ బిజీబిజీగా కనపించాయి. పాత్రలు, పూజలో ఉపయోగించే పదార్థాలు, దేవుళ్ల చిత్రాలు, విగ్రహాలు, తినుబండారాల దుకాణాలన్నీ కిటకిటలాడాయి. హనుమాన్​గడీ టెంపుల్ వద్ద స్వీట్​షాపు పెట్టుకున్న అనూప్ సైనీ, వైభవ్​గుప్తా.. పేపర్లు తిరగేస్తూ, సుప్రీం తీర్పు గురించి చర్చించుకుంటూ కనిపించారు. ‘‘రామ్​లల్లాకు అనుకూలంగా తీర్పు వస్తే… మా దగ్గర ఉన్న పూలదండలు సరిపోవని తెలుసు. అందుకే వారణాసి, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాం” అని అనూప్ వివరించారు. ఇప్పుడు అయోధ్య సరైన దారిలో వెళ్తుందని అభిప్రాయపడ్డారు. అయోధ్య త్వరలోనే స్వర్ణయుగాన్ని చూస్తుందన్నారు.

పేపర్లు చూస్తూ..

అయోధ్యలోని రికబ్​గంజ్​తోపాటు చాలా ఏరియాల్లో ఆదివారం ఉదయం స్థానికులు పేపర్లు చూస్తూ బిజీగా కనిపించారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి చర్చించుకున్నారు. జడ్జిమెంట్​లో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అయోధ్య తీర్పుపై ఎలా ఫీల్ అవుతున్నారో కదా?’ అంటూ మాట్లాడుకున్నారు.

అంతా ప్రశాంతం

అయోధ్య ప్రశాంతంగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కేవలం భద్రత విషయంలోనే పోలీసులు తనిఖీలు, గుర్తింపు కార్డులు పరిశీలన చేస్తున్నారు. తీర్పు పరిస్థితుల నేపథ్యంలో రోజూ ఉదయం, సాయంత్రం ఆలయం, సరయూ నది ప్రాంగణల్లో నేరుగా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో  ఫోన్లో అప్​డేట్ తెలుసుకుంటున్నాను. ఇప్పటికే 60 శాతం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. మరో రెండు రోజుల్లో పూర్తిగా దుకాణాలు, హోటళ్లు అందుబాటులోకి తెస్తాం. సిటీ లోపల, ఆలయం ప్రాంగణంలో మాత్రం మరికొన్ని రోజులు ఆంక్షాలు కొనసాగుతాయి.

– అనుజ్ కుమార్ ఝా, అయోధ్య జిల్లా కలెక్టర్

Latest Updates