అయోధ్య ఇష్యూ క్లోజ్: ఇక అసలైన సమస్యలపై ఎన్నికలు

కూడు, గూడు, చదువు.. ఇకపై ఎన్నికల అజెండాలివే

భారత రాజకీయాల దిశను మార్చేలా సుప్రీం తీర్పు 

బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి స్వాగతించారు. దశాబ్దాలుగా పరిష్కారంకాని సమస్యకు అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్పునిచ్చిందంటూ సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పారామె. ఇది భారతదేశ రాజకీయాల గతిని మార్చే తీర్పు అని అన్నారు. వివాదాస్పద భూమిలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో ఇక అయోధ్య అంశంపై ఎన్నికల్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో రామ మందిరం ఇష్యూపై ఎన్నికలు జరగబోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇకపై అసలైన సమ్యలపై ఎన్నికలు జరుగుతాయని అన్నారు. కూడు, గూడు, చదువు.. ఇవే ఎన్నికల అజెండాలవుతాయని చెప్పారు.

సూడో సెక్కులరిస్టులకు సవాల్ విసిరిన వ్యక్తి అద్వానీ

అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత బీజేపీ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీని కలిశారు ఉమా భారతి. ఆయనతో భేటీ తర్వాత వెళ్తూ మీడియాతో మాట్లాడారామె. అద్వానీ కృషితోనే ఆయోధ్య ఉద్యమం ఉపందుకుందని, ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలన్నారామె. సూడో సెక్యులరిస్టు డ్రామాలను ఎండగట్టి.. ఆ కుహనా సెక్యులర్లకు సవాల్ విసిరిన వ్యక్తి అద్వానీ అని చెప్పారు ఉమా భారతి. తాను ఆయనకు బిడ్డలాంటిదాన్ననని, ఆయనే తనకు గురువు, నాయకుడు అని చెప్పారు. భారతీయ జనతా పార్టీని నిలబెట్టిన నేత ఆయనేనని అన్నారామె. జాతీయ వాదానికి, సూడో సెక్యులరిజానికీ తేడా చెబుతూ తొలిసారి అయోధ్య అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన వ్యక్తి అద్వానీ అని చెప్పారామె. అందుకే ఈ రోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానన్నారు.

అయోధ్యలో వివాదాస్పద భూమి రామ మందిర నిర్మాణానికి ఇచ్చిన సుప్రీం కోర్టు.. సున్నీ వక్ఫ్ బోర్డుకు మరోచోట ఐదెకరాల భూమి ఇవ్వాలని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

Latest Updates