ఒమిక్రాన్​కు ఆయుర్వేద ట్రీట్​మెంట్

ఒమిక్రాన్​కు ఆయుర్వేద ట్రీట్​మెంట్
  • నిట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ శ్యామ్​
  •  8 మొక్కలపై రీసెర్చ్​ చేశామని వెల్లడి
  •  2 నెలల్లో క్లారిటీ వస్తుందని వివరణ
  •   గతంలో కరోనా వచ్చినోళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన

వరంగల్​, వెలుగు: గతంలో కరోనా బారిన పడినోళ్లకు ఒమిక్రాన్​తో ముప్పు ఎక్కువగా ఉంటుందని వరంగల్​ నిట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ పెరుగు శ్యామ్​ హెచ్చరించారు. వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డెల్టా వేరియంట్​ హైబ్రిడ్​గా మారడంతో వైరస్​ స్పీడ్​ ఎక్కువగా ఉందని చెప్పారు. దాని ప్రభావం లోపలి అవయవాలపై పడే ప్రమాదం ఉందన్నారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీకి చెందిన ఆయన కరోనా వైరస్​ వేరియంట్లు, వాటి ప్రభావం, ట్రీట్​మెంట్​ పద్ధతులపై రీసెర్చ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్​ ప్రభావం గురించి ‘వీ6 వెలుగు’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒమిక్రాన్​కు ఆయుర్వేద ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు 8 రకాల మొక్కలపై రీసెర్చ్​ చేశామని చెప్పారు. ఒక్కొక్క మొక్క నుంచి తీసిన చూర్ణంతో పాటు.. అన్ని మొక్కల పదార్థాలతో కలిపి తయారు చేసిన చూర్ణాలతో ఒమిక్రాన్​పై ప్రయోగించి చూశామని తెలిపారు. ఒకట్రెండు నెలల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఆక్సిజన్​ స్వచ్ఛంగా లేకనే బ్లాక్​ ఫంగస్​
కరోనా సెకండ్​ వేవ్​లో డెల్టా వేరియంట్​.. లంగ్స్​పై తీవ్ర ప్రభావం చూపిందని శ్యామ్​ తెలిపారు. దీంతో బాధితులకు ఆక్సిజన్​ అవసరం ఎక్కువైందన్నారు. ఆక్సిజన్​ స్వచ్ఛత ఆధారంగానే పేషెంట్లు కోలుకున్నారన్నారు. స్వచ్ఛత లేనిచోటే కరోనా పేషెంట్లు బ్లాక్​ ఫంగస్​, ఎల్లో ఫంగస్​ బారిన పడ్డారని చెప్పారు. డెల్టా వేరియంట్​లో మార్పులు జరుగుతున్నాయని, అది హైబ్రిడ్​గా మరే ప్రమాదముందంటూ ఎనిమిది నెలల కిందటే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్​గా అది రూపం మార్చుకుందని, ఈ వేవ్​లో దాని స్పీడ్​ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఫస్ట్​ వేవ్​లో మామూలు వైరస్​లో జరిగిన మూడు మ్యుటేషన్లు, సెకండ్​వేవ్​లో జరిగిన 9 మ్యుటేషన్లకే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూశామని, అలాంటిది 52 మార్పులు జరిగిన ఒమిక్రాన్​తో ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నెలాఖరు నాటికి ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతాయని 
తెలిపారు.  

తీవ్రత ఉండకపోవచ్చు
దేశంలో వాక్సినేషన్​లో స్పీడ్​ పెంచడం కొంత ఊరటనిచ్చే విషయమని శ్యామ్​ చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చని అన్నారు. పండుగలు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండకుంటే కేసులు భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. థర్డ్​ వేవ్​, ఒమిక్రాన్​ వేరియంట్​, భవిష్యత్తులో వచ్చే వేరియంట్లు, మెడిసిన్​ వంటి అంశాలపై పరిశోధనలు చేశామని, ఆ డేటా తయారీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. ఇంటర్నేషనల్​ జర్నల్స్​ పబ్లిష్​ అయ్యేంత వరకు దాని మీద ఓ కన్​క్లూజన్​ ఇవ్వడానికి వీలుంటుందని తెలిపారు.