
స్టూడెంట్స్ నుంచి భారీ మొత్తంలో ఫీజులు
బీఈడీ ప్రైవేటు కాలేజీలు కొత్త దందా మొదలుపెట్టాయి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయకున్నా కొందరు స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఏకంగా కన్వీనర్ కోటాలోనే కొన్ని కాలేజీలు సీట్లు ఇస్తున్నాయి. ఎడ్ సెట్లో క్వాలిఫై అయితేనే సీట్లు ఇవ్వాలనే రూల్‌ను తుంగలో తొక్కుతున్నాయి. దీంతో కనీసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయని వాళ్లు కూడా బీఈడీ చేస్తున్నారు. మరోపక్క రూల్స్‌కు విరుద్ధంగా నాన్‌లోకల్ వాళ్లకూ ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అయితే ఇలాంటి అడ్మిషన్లను ఉన్నత విద్యామండలి అధికారులే రాటిఫై చేయడం గమనార్హం.
నేరుగా ఉన్నత విద్యామండలి నుంచి..
రాష్ట్రంలో మొత్తం 222 బీఈడీ కాలేజీలున్నాయి. వీటిలో 19,750 సీట్లున్నాయి. 2019–20 ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్–2019లో మొత్తం 43,113 మంది పరీక్ష రాస్తే, వారిలో 41,195 మంది అర్హత సాధించారు. ప్రైవేటు కాలేజీల్లో 75 శాతం కన్వీనర్ కోటా, 25 శాతం మేనేజ్మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కన్వీనర్ కోటా సీట్లను ఎడ్ సెట్‌ద్వారా భర్తీ చేస్తారు. అయితే కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ కానప్పుడు, మేనేజ్మెంట్ల కోరిక మేరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే పలు ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో ఈ రూల్స్‌కు విరుద్ధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. కాలేజీలో కన్వీనర్, మేనేజ్మెంట్, స్పాట్కేటగిరీల్లో సీట్లు భర్తీ అయినా వాటిని సెట్ అడ్మిషన్ కన్వీనర్ రాటిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ స్టూడెంట్స్ ఫీజు కట్టే అవకాశముంటుంది. ఈ క్రమంలో పలు కాలేజీల మేనేజ్మెంట్లు ఈ కేటగిరీలతో సంబంధం లేకుండా, కొన్ని అడ్మిషన్లు చేసుకోగా, వాటిని తిరస్కరించారు. దీంతో ఆయా కాలేజీలు ఉన్నత విద్యామండలి నుంచి నేరుగా అడ్మిషన్లపై రాటిఫై పొందాయి. రాష్ట్రంలో 8 కాలేజీల్లో ఇలా అడ్మిషన్లు జరిగాయని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి కాలేజీలు ఇంకా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా అడ్మిషన్లు ఇచ్చినందుకు కాలేజీలు భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో 36 మంది ఇలా సీట్లు పొందినట్టు సమాచారం. ఇందులో ఇతర రాష్ర్టాల వారే11 మంది ఉన్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో సుమారు15 వేల సీట్లుంటే, ఈ ఏడాది 12,465 సీట్లు భర్తీ అయ్యాయి.
రూల్స్‌కు విరుద్ధం..
ఎంట్రెన్స్ రాస్తేనే సీట్లకు అర్హులని నోటిఫికేషన్లో ప్రకటన చేసి, తర్వాత దాంతో సంబంధం లేకుండా సీట్లు భర్తీ చేయడం రూల్స్‌కు విరుద్ధమని కొందరు అధికారులు చెప్తున్నారు. అలా భర్తీ చేసే ఆలోచన ఉంటే, ముందుగానే నోటిఫికేషన్ లో సూచించాల్సి ఉంటుందని అంటున్నారు. కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగేట్–2019)లో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో సీట్లు భర్తీ కాకపోతే, పరీక్ష రాయని వాళ్లను కూడా తీసుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. అలాంటి ప్రకటనేమీ ఇవ్వకుండా, కేవలం కొన్ని కాలేజీలకే ఇలా దొడ్డిదారిన అడ్మిషన్లు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ లోకల్ కోటాలో కేవలం 5 శాతం సీట్లే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పలు కాలేజీల్లో ఆ కోటాకంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రూల్స్ ప్రకారమే
రూల్స్ ప్రకారమే బీఈడీలో సీట్లను భర్తీ చేశాం. కొన్ని కాలేజీల్లో సీట్లు భర్తీకాకుంటే, మేనేజ్మెంట్లు భర్తీ చేసుకునే అవకాశం కోర్టు ఇచ్చింది. ఆ మేరకు కౌన్సిల్ వద్దకు వచ్చిన వారికి అవకాశం ఇచ్చాం. కొన్ని కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారిని మేనేజ్మెంట్లు ఫీజుల కోసం వేధిస్తే, వాళ్లు కాలేజీ మానేశారనే ఆరోపణలపైనా ఎంక్వైరీ చేశాం. అయితే అదంతా తప్పని తేలింది.
– పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్