జాబు రావాలంటే బాబు పోవాలి: జగన్‌

రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు పోవాలనే పరిస్థితి ఉందన్నారు YCP అధినేత జగన్మోహన్‌ రెడ్డి. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. డిగ్రీలు పూర్తి చేసిన యువకులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి తప్పారన్నారు. ఐదేళ్ల పాలన తర్వాత దేశంలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా ఏపీ సీఎం చంద్రబాబు మారారన్నారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన ఏకైక ఉద్యోగం లోకేశ్‌కు మాత్రమేనన్నారు. లోకేశ్‌కు ఉద్యోగం ఇవ్వడమే కాదు ప్రమోషన్‌ కింద మంత్రి పదవి ఇచ్చారన్నారు. చంద్రబాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు జగన్.

అంతేకాదు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు వైఎస్ జగన్. బాబు పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయమే జరిగిందన్నారు. ఏపీ రైతులు దేశంలోనే అత్యధిక రుణ భారంలో ఉన్నారన్నారు. కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సరిగా నీరివ్వడం లేదని విమర్శించారు.

తాము అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు జగన్. ప్రతి ఊరిలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తామని, మీ ఊళ్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Latest Updates