చిన్నారి శరీరాన్ని కాల్చి వేసిన అగ్గిపెట్ట ఆట

Baby Lower body was burned when she played with matchsticks
  • సాయం చేసేందుకు ముందుకొచ్చిన పీహెచ్‌సీ సంస్థ
  • సోషల్ మీడియా వేదికగా విరాళాల సేకరణ
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Baby Lower body was burned when she played with matchsticks
చికిత్స పొందుతున్న సిరివెన్నెల, తండ్రి విజయ్‌ కు నగదు అందజేస్తున పీహెచ్‌ సీ ప్రతినిధులు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలిసీతెలియని వయస్సు సిరివెన్నెలది. చేతికి అగ్గిపెట్టె దొరకడంతో ఆడుకుందామనుకుంది. కానీ అదే ఆ చిన్నారి శరీరాన్ని కాల్చివేస్తుందని తెలుసుకోలేకోపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్గిపెట్టెతో ఆడుకొంటూ ఒంటికి నిప్పంటించుకుని హాస్పిటల్ పాలయింది. బాధ, నొప్పి అంటే ఏంటో తెలియని పసి ప్రాయంలో నడుము కింద నుంచి 70 శాతం కాలిన గాయాలతో పోరాడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి పీపుల్‌‌ హెల్ప్‌‌ చిల్డ్రన్ ‌‌(పీహెచ్‌సీ) స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. పాప ట్రీట్ మెంట్‍ కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

కూకట్‌‌పల్లికి చెందిన రోజువారీ కూలీలైన సిరివెన్నెల తల్లిదండ్రులు ఈ నెల 2వ తేదీన పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి అగ్గిపెట్టెతో ఆడుకుంటూ డ్రెస్‌‌కు నిప్పంటించుకుంది. గమనించిన చుట్టుపక్కలవారు నిప్పును ఆర్పివేసి పాపను కూకట్‌‌పల్లి రామ్‌ దేవ్‌‌రావు దవాఖానకు తరలిచించారు. చిన్నపిల్లల కోసం పనిచేస్తున్న పీహెచ్‌సీ స్వచ్ఛంద సంస్థ పాప విషయం తెలుసుకొని సాయం చేసేందుకు ముందుకొచ్చింది. చిన్నారి పరిస్థితిని సోషల్‌‌మీడియా వేదికగా అందరికీ తెలిసేలా షేర్‍ చేసింది. స్పందించిన దాతలు ఆర్థికంగా ఆదుకునేందకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు రూ.1,00,780 నిధులు సేకరించి సిరివెన్నెల తండ్రి విజయ్‌ కు అందజేసినట్లు పీహెచ్‌ సీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే మూడు సర్జరీలు జరిగాయని, ప్రస్తుతానికి సిరివెన్నెల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌‌తోపాటు ఇతర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల వారు పాపకు సాయం చేశారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates