భువనగిరిలో దారుణం: బిడ్డను అమ్మేసిన పెళ్లికాని యువతి

భువనగిరిలో దారుణం: బిడ్డను అమ్మేసిన పెళ్లికాని యువతి

యాదాద్రి భువనగిరి జిల్లా: అత్యాచారానికి గురై.. వివాహం కాని యువతికి ఓ పాప పుట్టింది. అయితే ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని యువతి బంధువులు ప్లాన్ వేశారు. 10 రోజుల పసికందును తెలిసిన వాళ్లకు రూ.60 వేలకు అమ్మేశారు. ఓ కేసు విషయంలో అసలు విషయం బయటపడటంతో శిశువును అమ్మిన నలుగురిపై కేసు నమోదైంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరిలో జరుగగా స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాలు:  సెప్టెంబర్ 12న భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఓ పెళ్లికాని యువతి. రెండు రోజుల క్రితం ఆ పసికందును మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మండలం, ఏదులాబాద్ గ్రామానికి చెందిన దంపతులకు విక్రయించారు. భువనగిరి శివారులో ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర పాపను విక్రయించారు. 10 రోజుల పసికందును రూ. 60 వేలకు విక్రయించారు తల్లి తరుపు కుటుంబ సభ్యులు. అయితే.. వివాహం కానీ యువతి హైదరాబాద్, నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు. యువతి మీద నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం జరిగిందని గతంలో కేసు నమోదైంది.

అత్యాచారం ద్వారానే గర్భం దాల్చిన యువతికి శిశువు జన్మించిందనే విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు విచారణలో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తీసుకు రావాలని యువతికి చెప్పారు నేరెడీమేట్ పోలీసులు. అయితే పాప పుట్టగానే  చనిపోయిందని పోలీసులకు తప్పుడు సమాచారం అందించారు యువతి, ఆమె కుటుంబసభ్యులు. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పాపను విక్రయించినట్లు తేలిందని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరాజ్యం. వెంటనే పాపను భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు నేరెడ్ మెట్ పోలీసులు. తల్లిని, పాపను రక్షణ కోసం సఖి సెంటర్ కు తరలించిన భువనగిరి పోలీసులు.. పాపను అమ్మిన నలుగురిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతిపై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించిన విచారణ నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో జరుగుతుందన్నారు భువనగిరి టౌన్ సీఐ సుధాకర్.