గోన గన్నారెడ్డిగా నందమూరి నటసింహం?

హైదరాబాద్: దాన వీర శూర కర్ణలో అభిమన్యుడిలా, అక్బర్ సలీం అనార్కలీలో సలీంగా, ఆదిత్య 369లో కృష్ణదేవరాయుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ అలరించాడు. ఆ తర్వాత గౌతమీ పుత్ర శాతకర్ణిలో నటించి మరోసారి పౌరాణిక పాత్రల్లో తనదైన మార్కును చూపించాడు. అలాంటి బాలయ్య బాబు మరోసారి పవర్‌‌ఫుల్ పౌరాణిక పాత్రలో యాక్ట్ చేయబోతున్నాడని సమాచారం. కాకతీయ వీరుడైన గోన గన్నా రెడ్డి పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి బాలయ్య సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్‌‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘గోన గన్నా రెడ్డి జీవితంపై సినిమా తీయాలని బాలయ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాడు. చాలా పుస్తకాల్లో గోన గన్నారెడ్డి గురించి కావాల్సినంత సమాచారం అందుబాటులో ఉంది. అయితే వాటికి సరైన తెర రూపం అందించాల్సి ఉంటుంది. గన్నా రెడ్డి లాంటి పాత్రను పోషించడంలో బాలయ్యకు మంచి అనుభవం ఉంది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు బాలయ్య ఆసక్తితో ఉన్నాడు. బోయపాటి సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత గన్నా రెడ్డి కథా చర్చల్లో రైటర్స్‌‌తో బాలయ్య కూర్చునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సరిపోయే డైరెక్టర్‌‌ను ఎంపిక చేస్తాం’ అని బాలకృష్ణకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. నిజంగా ఈ మూవీ తెరకెక్కనుందా? అందులో బాలయ్య బాబు నటించబోతున్నాడా? లాంటి మరిన్ని వివరాలు తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Latest Updates