బల్దియా ఫెయిల్‌‌..సిటీలో పొంగిపొర్లుతున్ననాలాలు

  • కంప్లయింట్‌ చేసినా స్పందించని అధికారులు
  • ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావిడి
  • ఆ తర్వాత అంతామామూలేనని వదిలేస్తూ ..
  • బల్దియా తీరుపై సిటిజన్స్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు :  సిటీలో మాన్‌‌సూన్‌‌ ప్లాన్‌‌ అమలులో బల్దియా ఫెయిల్‌‌ అయ్యింది. అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వానలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. గ్రేటర్‌‌లో 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలు ఉండగా, చాలా ప్రాంతాల్లో ఓపెన్​ నాలాలే ఉన్నాయి. ఈ క్రమంలో నాలాల్లో జనాలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిలో పూడిక తీయకపోవడంతో కొద్దిపాటి వాన పడినా పొంగి ప్రవహిస్తున్నాయి.మరోవైపు రోడ్లన్నీ బురదమయమై నడిచేందుకు కూడా స్థలం కనిపించదు. ప్రమాదమని తెలిసినా కూడా నాలాల పక్క నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు డ్రైనేజీ పైపులైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఎక్కడిక్కడ జామ్ అవుతున్నాయి.  మ్యాన్ హోల్స్ పొంగిపొరుతుండగా రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. నాలాలు,చెరువులపై అక్రమ నిర్మాణాలు ఎక్కువవడంతో మూసీలో కలవాల్సిన నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. బల్దియా నిర్లక్ష్యం కారణంగా జనాల ప్రాణాలు పోతున్నాయని సిటిజన్స్‌‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్లు గడుస్తున్నా…

వరద నీటిని సిటీ నుంచి బయటకు సేఫ్​గా పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  గతంలో ప్రభుత్వం కమిటీలను  ఏర్పాటు చేసింది.  ఏళ్లు గడుస్తున్నా నాలాల పరిస్థితిలో మార్పులేదు. విస్తరణ సంగతేమో గానీ.. క్రమంగా  కబ్జా అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రిటైనింగ్‌‌ వాల్స్‌‌ నిర్మించినా సమస్య పోలేదు. 2017లో భారీ వర్షాలు కురిసినప్పుడు మంత్రి కేటీఆర్​ ఫీల్డ్‌‌ లెవల్‌‌లో పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే  సర్వేల రిపోర్టులు ఉన్నా.. మరోసారి స్టడీ చేసేందుకు  కమిటీని ఏర్పాటు చేయాలని   కేటీఆర్  ఆదేశించారు.

12 వేల ఆక్రమణలు ఉన్నట్లు లెక్కలు

నాలాల వాస్తవ విస్తీర్ణం, ఆక్రమణల గుర్తింపు ప్రక్రియకు డ్రోన్‌‌ కెమెరాలతో ఫొటోలు సేకరణ, రెవెన్యూ, ఇరిగేషన్‌‌ విభాగాల వద్ద ఉన్న టోపో షీట్ల ఆధారంగా సేకరించారు.  మొత్తం 12వేల ఆక్రమణలు ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటి తొలగింపునకు రూ.10వేల కోట్లు కావాల్సి ఉందని, మొదటి విడతలో రూ.230 కోట్లతో 842 ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఈ పనులకు 47 స్ర్టెచ్‌‌లుగా టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రకటించి 46 ప్రాంతాల్లో అప్పగించారు. 26 ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభం కాగా.. మూడేళ్లలో 15 ప్రాంతాల్లో 6 కిలోమీటర్లలోపే విస్తరణ, రిటైనింగ్‌‌ వాల్‌‌ నిర్మాణం కంప్లీట్‌‌ అయ్యింది. మరోవైపు ఆస్తుల సేకరణ చేయలేదనే కారణం చూపుతూ పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేసుకున్నారు. పరిహారం చెల్లింపుపై స్పష్టమైన ఉత్తర్వులున్నా ఆస్తుల సేకరణలో అధికార యంత్రాంగం ఫెయిల్‌‌ అయ్యింది.

తీరని సిటిజన్స్‌‌ కష్టాలు

ప్రభుత్వాలు మారుతున్నా.. గ్రేటర్​ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన బల్దియా ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గ్రేటర్​పీఠాన్ని టీఆర్​ఎస్ సొంతం చేసుకుంది. ఆ హామీల్లో హైదరాబాద్​ను డల్లాస్​ నగరంగా తీర్చిదిద్దుతామని స్వయంగా సీఎం కేసీఆర్​ చెప్పారు. ఐదేళ్లు అవుతున్నా.. ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. వర్షాలు కురిసినప్పుడు ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన సమయంలోనే బల్దియా అధికారులు హడావిడి చేస్తున్నారు. ప్రతి ఏడాది వానాకాలంలో పదుల సంఖ్యలో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

100కుపైగా వాటర్‌‌ లాగింగ్‌‌ పాయింట్లు

జీహెచ్‌‌ఎంసీ, పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో100పైగా లాగింగ్​ పాయింట్లు ఉన్నాయి. వీటిలో 24  మేజర్‌‌ లాగింగ్‌‌ పాయింట్లలో వర్షపునీరు ఎక్కువగా నిలుస్తుంది. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు ముందుకుసాగడంలేదు. మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందుకొస్తే పాలకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులను అడ్డుకుంటున్నారు. ఇక కొద్దినెలల్లో బల్దియా ఎన్నికలు వస్తుండడంతో నాలాల విస్తరణ పనులు జరగడం కష్టంగానే కనిపిస్తుంది.

చిన్న వాన పడినా..

చిన్న వర్షం కురిస్తే ఓపెన్‌‌ నాలా పొంగి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా టైమ్‌‌కు స్పందించరు. 20 ఏళ్లుగా ఇదే సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు చేరడంతో ఎమ్మెల్యే, అధికారులు వచ్చి చూసి వెళ్లారు. కానీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేదు. -సులోచన, లక్ష్మీనగర్, లంగర్​హౌజ్ డివిజన్​

హామీలు ఏమైనయి..

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం, మంత్రులు ఇచ్చిన హామీలు ఏమైనయి. ఐదేళ్లు గడుస్తున్నా జనాలకు ఇబ్బందులు తప్పడంలేదు. చిన్నపాటి వర్షాలు కురిస్తే ఇండ్లలోకి వరద చేరుతుంది. నాలాల పూడికతీత చేపట్టకపోవడంతో పొంగిపొర్లుతున్నాయి. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలు ఆలోచించాలి.
-జెన్నా సుధాకర్, బీజేవైఎం సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్

Latest Updates