నీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ..మంత్రి వివేక్ ఫైర్
ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూర్‌లో బాల్క సుమన్ రౌడీయిజం నడ్వదని, అతని బెదిరింపులు తమ దగ్గర సాగవని -రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. ‘బాల్క సుమన్.. నీ రౌడీయిజం ఈడ నడ్వది! -నీ ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కడైనా చూపించుకో.. చెన్నూరులో కాదు.. గుంపులకు గుంపులుగా వచ్చి కాన్వాయ్‌పై దాడిచేస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరు.. ఇకనైనా తీరుమార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. నియోజవర్గంలో బాల్క సుమన్అరాచకాలు శ్రుతి మించుతున్నాయని, ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్టేషన్‌తో తమ కాన్వాయ్‌పై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ తరహా గుండాగిరీ రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్అఫీషియో సభ్యులుగా తాను, ఎంపీ వంశీకృష్ణ వెళ్లామని, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ గుంపుతో వచ్చిన బాల్క సుమన్తన కాన్వాయ్‌పై ఒక్కసారిగా దాడి చేశాడన్నారు. ట్రాఫిక్ కోన్ డివైడర్లతో దాడి చేస్తున్నట్లు వీడియోల్లోనూ స్పష్టంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఈ దాడిలో ఒక కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడడం బాధకరమన్నారు. ‘మున్సిపల్ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాం. ఏ ఒక్కరి మీదా ఒత్తిడి తేలేదు. గతంలో అనేక మందిని బెదిరించి, దౌర్జన్యాలకు పాల్పడిన చరిత్ర బాల్క సుమన్ కు ఉంది. నిజంగా బీఆర్ఎస్హయాంలోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది’ అని అన్నారు.
తాను ఎమ్మెల్యే గా గెలిచాక ఏ ఓక్క బీఆర్ ఎస్ కార్యకర్తపైనా కేసు పెట్టలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టిన బీఆర్ఎస్ నీచ చరిత్ర అందరికీ తెలుసన్నారు. మున్సిపాలిటీలో తమ కౌన్సిలర్ పై బీఆర్ఎస్, సీపీఐ వాళ్లు దాడులు చేస్తేనే తాము బయటకొచ్చామని మంత్రి వివేక్ చెప్పారు. తన కాన్వాయ్‌పై దాడిచేసిన బాల్క సుమన్ పైన పోలీసులు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బాల్క సుమన్‌పై మహిళా కౌన్సిలర్లు ఫైర్..
క్యాతనపల్లి మున్సిపల్ఆఫీస్లో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తమపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు ఖండించారు.
మంగళవారం మహిళా కౌన్సిలర్లు పల్లె శ్రీదేవి, పూల్లూరి తిరుమల, గోపతి భాగ్య, మంతెన మల్లమ్మ, దాముక శిరీష మాట్లాడుతూ, కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తాము ఎవరిపైనా అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. కావాలనే బాల్క సుమన్ కాంగ్రెస్ కౌన్సిలర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమపై, ఎంపీ, మంత్రి వాహనాలపై బాల్క సుమన్ రాళ్ల దాడితో రౌడీయిజం చేశాడన్నారు. మహిళలపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా అని బాల్క సుమన్ ను ప్రశ్నించారు. బాల్క సుమన్ ఇకనైనా రౌడీ రాజకీయం మానుకోవాలని హెచ్చరించారు.
ప్రజల కోసం పనిచేస్తున్నవారిపై దాడులా?
మంత్రి వివేక్‌పై దాడిని ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: ప్రజల కోసం పనిచేస్తున్నవారిపై దాడులకు పాల్పడటమేమిటని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడి ఆయన ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి వివేక్ పై దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైందని, అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాప్రతినిధులపై, మంత్రులపై దాడులు జరిగేలా ప్రోత్సహించడం అటాక్ చేయించినవారిలోని అసహనాన్ని తెలియజేస్తుందన్నారు. ఇలాంటి దాడులు సరైనవి కాదని, వీటిని ఎవరూ సమర్థించరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వివేక్ లాంటి సౌమ్యులపై దాడికి యత్నించిన వారిని ఎవరూ ఊపేక్షించరని హెచ్చరించారు
కేటీఆర్ వీధి గూండాలను పోషిస్తున్నరు
ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వీధి గుండాలను పెంచి పోషిస్తున్నారని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై బాల్క సుమన్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కాన్వాయ్‌పై బాల్క సుమన్ రాళ్ల దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ ఇప్పటికీ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వంలో బాల్క సుమన్ వంటి రౌడీలకు స్థానం ఉండదని హెచ్చరించారు. చెన్నూరు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో.. ఇక రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల్లో అలాంటి తీర్పే వస్తుందని జోస్యం చెప్పారు.
కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయ మరుగుజ్జులు..చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులు రాష్ట్రంలో రాజకీయ మరుగుజ్జులుగా మారుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పినా కేటీఆర్, హరీశ్ రావులలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతోనైనా ఆ ఇద్దరు తమ తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.
ప్రజలు ఛీ కొట్టినా, చీత్కరించినా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగానైనా కేటీఆర్, హరీశ్ రావుల ప్రవర్తనలో మార్పు రావాలని, ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాలగమనంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ గూండాగిరిని సహించం..ఎంపీ వంశీ, మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి హేయం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధ్వంసకర చర్యలకు, హింసకు తావులేదని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పోలీసుల బారికేడ్లను అడ్డుకుని, రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడటం దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు గాయాలవ్వడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం దారుణం. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వయంగా దగ్గరుండి రౌడీయిజాన్ని, గూండాగిరీని ప్రోత్సహించడం సిగ్గుచేటు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఓడిపోయిన నిరాశలో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది కానీ, భౌతిక దాడులకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. దాడికి పాల్పడింది ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టించిన బాధ్యులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాల్క సుమన్‌పై కేసు నమోదు
కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ మీద దాడికి పాల్పడడంతో పాటు పోలీసుల విధులను ఆటంకపర్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం, రాళ్లతో దాడికి పాల్పడి కోటపల్లి ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేశ్ లకు గాయాలయ్యేందుకు కారణమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేశ్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిపై రామకృష్ణాపూర్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్త జావీద్ గాయపడిన ఘటనకు సంబంధించి మరో కేసు నమోదైంది.
