‘అకార‌ణంగా దాడి చేశారు.. ఆ ఎస్సై పై చర్య‌లు తీసుకొండి’‌

తమ పై అకారణంగా దాడి చేసిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సై శ్రీహరిపై అదే గ్రామానికి చెందిన రైతు గండ్ల హరీష్ ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18న తాము పండించిన మక్కలు బైపాస్ లో అరబెట్టి కాపలాగా ఉన్న తన తండ్రి రాజేందర్ బైక్ ను సీజ్ చేశార‌ని , అంతే కాకుండా త‌న తండ్రిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఎస్సై విచక్షణ రహితంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి కోసం పోలీస్ స్టేషన్ వెళ్లిన తనను కూడా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని కమిషన్ కు వివరించారు.
తాము పండించిన పంటను కాపాడుకోడానికి కాపలాగా ఉన్న తన తండ్రి , తనపై అకారణంగా దాడి చేసిన ఎస్సై శ్రీహరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు గండ్ల హరీష్ కమిషన్ ను వేడుకున్నాడు. తమపై జరిగిన దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోల ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ చంద్రయ్య ఈ ఘటనపై జూన్ 29 లోగా నివేదిక సమర్పించాలంటూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates