తెలంగాణలో సుష్మాస్వరాజ్ విగ్రహం : దత్తాత్రేయ, వివేక్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఆడిటోరియంలో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ శ్రద్దాంజలి సభ జరిగింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి, ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్, తెలంగాణ పౌర స్పందన వేదిక కన్వీనర్ మోహన చారి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ.

ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. ఎంపీగా పార్లమెంట్ లో పోరాడుతున్నప్పుడు.. తమకు సుష్మాస్వరాజ్ ఎంతో మద్దతుగా నిలిచేవారని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లు పాస్ కావడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆంధ్ర నాయకుల ఒత్తిడి లొంగకుండా తెలంగాణకు మద్దతు ఇచ్చారని అన్నారు. సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత  ముఖ్యమంత్రి కేసీఅర్ , టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించకపోవడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని కేసీఅర్ మర్చిపోయారని..  ఈ టల రాజేందర్ ను కూడా పక్కన పెడుతున్నారని చెప్పారు.

కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ… సుష్మా స్వరాజ్ తో కలసి 13 ఏళ్లు పార్లమెంటులో పని చేశానని గుర్తుచేసుకున్నారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో సుష్మా స్వరాజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. జాతీయ వాద ప్రభుత్వం రాగానే తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్  ఘనమైన నివాళి అర్పించే విధంగా తెలంగాణలో ఆమె విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు దత్తాత్రేయ.

Latest Updates