బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్‌ను నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన చేసింది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కు రాష్ట్రంలో పార్టీ భాద్యతలు అప్పజెప్పింది అధినాయకత్వం. కొద్ది రోజులుగా అధ్యక్షుడిగా అవకాశం ఎవరికొస్తుందన్న ఉత్కంఠకు పార్టీ తెరదించుతూ బీసీ సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్‌ను ఎంపిక చేసింది. మొదటి నుంచి ఆరెస్సెస్, ఏబీవీపీల్లో పని చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఆయనకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే భాద్యతను అప్పగించింది.

ఆరెస్సెస్ సేవక్ నుంచి స్టేట్ చీఫ్ దాకా

ప్రస్తుతం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. విద్యార్థి దశ నుంచే ఆయన బీజేపీకి అనుబంధంగా పని చేస్తున్నారు. తొలుత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కరీంనగర్ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పలు భాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా సైతం సేవలందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ ఇంచార్జ్‌గా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె అద్వానీ చేపట్టిన రథ యాత్రలో వెహికల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు బండి సంజయ్.

కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలి రెండు ఎన్నికల్లో 48వ డివిజన్ నుంచి బిజెపి కార్పొరేటర్‌గా గెలిచారు. అలాగే వరుసగా రెండుసార్లు నగర బీజేపీ అద్యక్షుడిగా పని చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసి 52 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు బండి సంజయ్. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సాధించారు. అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 89 వేల పైగా మెజారిటీలో విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ.. నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్న బండి సంజయ్‌ను ఇప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీ చీఫ్‌గా నియమించింది.

Latest Updates