రాష్ట్రాన్ని ఏలని వాడు.. దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడు

యాదాద్రి భువనగిరి జిల్లా : సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం భువనగిరిలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ మజ్లీస్ తో లోపాయకారి ఒప్పందంతో రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. రాష్ట్రాన్ని ఏలని వాడు.. దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని..  దేశాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే ఓ పాకిస్థాన్ కో, ఆఫ్ఘనిస్తాన్ కో అంటగడుతారన్నారు. ఎల్ ఆర్ ఎస్ పేరు తో హైదరాబాద్ లోని వారి అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరణ చేసుకోవటానికేనని.. ఎల్ ఆర్ ఎస్ పేరుతో పేదల రక్తం తాగుతున్నారన్నారు. రెవెన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని..ప్రజల దృష్టిని మరల్చడానికి కొన్ని పత్రికలలో అనుకూల వార్తలు రాయించుకుంటున్నారని తెలిపారు బండి సంజయ్.

తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈ తరానికి చాటి చెప్పేందుకు బీజేపీ 2 రోజుల యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రజాకార్ల  అరాచకాలు,  అకృత్యాలకు గురైన స్థలాలను సందర్శిస్తున్నారు. ఉదయం భువనగిరి జిల్లా కొలనుపాక, రేణుకుంట, సిద్దిపేట జిల్లా భైరాన్ పల్లి, కూటిగల్లు, జనగామ జిల్లా తరిగొప్పులలో పర్యటించి తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించనున్నారు. మధ్యాహ్నం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా, పెద్దపల్లికి వెళ్తారు. రాత్రి గోదావరిఖని చేరుకొని అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లా భువనరిగిలో కొనసాగుతోంది.

Latest Updates