రామమందిరం శంకుస్థాపనపై ఓవైసీ చౌకబారు వ్యాఖ్యలు సరికాదు

హైదరాబాద్‌: రామమందిర శంకుస్థాపనకు ప్రధాని మోడీ హాజరు కావడంపై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రధానిపై ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. ఆగస్టు 5 న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేయడంపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి అని సంజయ్‌ అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజం అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని చెప్పారు. ఈ ఆలయం కేవలం హిందువులకు చెందింది మాత్రమే కాదని, ఇది భారతీయుల ఆలయం అని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా నరేంద్రమోదీ పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణం అని సంజయ్‌ అన్నారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం నిజమైతే మరి అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎలాంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని అన్నారు. భారతదేశ ప్రధానిగా, సర్వేజన సుఖినోభవంతు- సర్వ మానవాళి క్షేమాన్ని కోరుకునే హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, నరేంద్ర మోడీ కోట్లాదిమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అయోధ్యలో చేపట్టే భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో పాల్గొనడం చారిత్రాత్మక అవసరం అని బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.
ప్రధాని హోదాలో ఉంటూ అయోధ్య ఆలయ శంకుస్థాపనకు ప్రధాని వెళ్లడం కరెక్ట్‌ కాదంటూ అసదుద్దీన్‌ ఓవైసీ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కరోనా కారణంగా కేవలం 200 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

Latest Updates