ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వాలి

కరీంనగర్ : ముంపు గ్రామాలుగా ప్రకటించిన నారాయణపూర్, చర్లపల్లి, మంగపేట ప్రజలకు… ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలంలోని ముంపు గ్రామాలను ఎంపీ ఆదివారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పోలీసుల నిర్బంధాలతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, హక్కుల కోసం గొంతెత్తితే దౌర్జన్యాలలకు పాల్పడుతు‌న్నార‌ని అన్నారు.

ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. హామీలు నెరవేర్చమంటే అరెస్టులు చేస్తున్నద‌ని సంజ‌య్ విమ‌ర్శించారు. ప్రజల కన్నీళ్లతో… ప్రాజెక్టులు నింపాలని ప్రభుత్వం భావిస్తోందా…? అని ప్ర‌శ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించకుండా.. నారాయణపూర్ చెరువులో ప్రభుత్వం నీళ్లు నింపుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల… ప్రజల ఇళ్లల్లోకి నీరు చేరుతోందని అన్నారు.

ముంపు గ్రామాల ప్రజలు… వారి అస్తులు త్యాగం చేస్తే.. ప్రభుత్వం వారి ప‌ట్ల‌ పొమ్మనలేక పొగ పెడుతుందని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా… బీజేపీ ఎప్పటి నుంచో గళమెత్తుతోందని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి…. లేదంటే ముంపు గ్రామాల ప్రజలతో కలిసి.. ప్రగతి భవన్ కు వస్తామ‌ని సంజ‌య్ హెచ్చ‌రించారు.

Latest Updates