కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసింది: బండి సంజయ్

గత ఆరేళ్లుగా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటోన్న తెలంగాణ..కేసీఆర్ పాలనలో దివాళా తీసిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు జూన్ నెల సాలరీలను లాక్ డౌన్ పేరుతో కోత పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను దిగజార్చింది. 2018 నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతి కూడా తెలంగాణ ఉద్యోగులకు దిక్కులేకుండా పోయింది. తెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ సంగతి దేవుడెరుగు, నెల జీతం కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడం  కేసీఆర్ పాలనకు నిదర్శనం. గత ఆరేళ్లుగా అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డుల్లా లక్ష ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటివరకు కొత్తగా 40వేల ఉద్యోగాలను కూడా నియమించని అసమర్థులు మీరు. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య చెప్పాల్సిన పనేలేదు. 2018 ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల రిటైర్మంట్ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతామన్న మీరు ఆ ఊసే ఎత్తకపోవడం మీ అబద్ధాల చిట్టాకు మరో నిదర్శనం. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగి అన్న పదమే ఉండదని ఉద్యమ సందర్భంగా మీరిచ్చిన వాగ్దానం నీటిమీది రాతగానే మిగిలింది. మీ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగుతున్నందుకు మీరు సిగ్గుపడాలి. కేంద్రం అప్పులు ఇస్తే తప్ప రాష్ట్రం నడవలేని స్థితికి దిగజార్చిన మీరు నైతికంగా పాలించే హక్కు కోల్పోయినట్టేనని బీజేపీ భావిస్తోందంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్.

Latest Updates