భైంసా నిందితులకే సర్కార్‌ సపోర్ట్‌

హైదరాబాద్, వెలుగుసీఎం కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హిందూ సమాజంపై మానవత్వం చూపకుండా మానవ మృగంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భైంసా అల్లర్లలో బాధితులైన హిందువులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. దాడికి పాల్పడ్డ ఎంఐఎం గూండాలకు కొమ్ముకాస్తోందని ఫైర్ అయ్యారు. భైంసా అల్లర్ల బాధితులను ఆదుకునేందుకు సంజయ్ అభిమానులు సోమవారం ఆయనకు పార్టీ స్టేట్ ఆఫీసులో తులాభారం నిర్వహించారు. దీని ద్వారా వచ్చిన ఫండ్స్ ను భైంసా బాధితులకు అందజేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ మాట్లాడారు.

బాధితులు చెట్లు, టెంట్ల కింద బతుకుతున్నరు

ఇప్పటికీ భైంసా బాధితులు నిలువనీడ లేక చెట్లు, టెంట్లు, తడకల కింద తలదాచుకుంటున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సర్కార్ తరఫున ఎలాంటి సాయం అందలేదన్నారు. అకృత్యాలకు పాల్పడుతున్న గూండాలను ఎదురించిన పాపానికి హిందూ యువకులనే జైలుకు పంపిన చరిత్ర ఈ సర్కారుదన్నారు. సేవా భారతి సంస్థ ద్వారా బాధితులకు ఇళ్లు కట్టించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా హిందువులకు రక్షణగా నిలవలేదని, ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో ఎదురు చూసే పరిస్థితుల్లో హిందూ సమాజం లేదన్నారు. భైంసా అల్లర్ల తర్వాతైనా హిందూ సమాజం సంఘటితం కావాలని సంజయ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా ఉందామని, హిందూ ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.

రజాకార్ల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన గ్రామాల సందర్శన

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో ఎంపీ బండి సంజయ్ మంగళ, బుధ వారాల్లో టూర్ ప్లాన్ చేశారు. ఆనాడు రజాకార్ల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన గ్రామాలను సందర్శించనున్నారు. రజాకార్ల చిత్రహింసల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించి, వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పార్టీ స్టేట్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

బీజేపీలో చేరికలు

సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పలువురు సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం సంజయ్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

‘విమోచనం’పై గవర్నర్కు సంజయ్ లెటర్

సెప్టెంబర్ 17  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చూడాలని కోరుతూ గవర్నర్‌‌ తమిళిసైకి  బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్‌ సోమవారం లెటర్​ రాశారు. అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని లెటర్​లో ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, అధికారికంగా నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Latest Updates