టీఆర్‌‌ఎస్ లీడర్లు వణుకుతున్నారు

హైదరాబాద్, వెలుగు: దమ్ము, ధైర్యం లేని చేతకాని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు పహారా మధ్య బతుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రజా ఉద్యమాలతో టీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని, దీంతో వారు ప్రజల్లో తిరగలేకపోతున్నారని చెప్పారు. వరంగల్ లోని బీజేపీ ఆఫీసుపై, ఎంపీ ధర్మపురి అర్వింద్ తోపాటు తమ పార్టీ నేతలపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజల మద్దతుతోనే మా ఆందోళనలు

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక సెగ తగలకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల మద్దతు, వారిచ్చిన బలంతోనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్ద సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయని చెప్పారు. టీఆర్ఎస్ నాయకుల దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ రూల్స్ కు లోబడే ఆందోళనలు చేశామన్నారు.

అక్రమంగా అరెస్టు చేశారు

రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేసిందని బండి సంజయ్ విమర్శించారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, దీన్ని ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావును, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లను వరంగల్ లో పోలీసులు అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన దిశలో నడవనప్పుడు, అధికార పక్షం కక్ష సాధింపులకు పాల్పడుతున్నప్పుడు నిరసన కార్యక్రమాలు చేయడం రాజకీయ పార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సంజయ్ అన్నారు. పోలీసు కేసులతో తమ పార్టీ క్యాడర్ ను భయపెట్టాలని చూడడం రాష్ట్ర సర్కార్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమన్నారు.

పోలీసులు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

వరంగల్ లో ఎంపీ అర్వింద్ పై దాడి జరుగుతున్న సమయంలో భద్రత కల్పించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారించిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముందు అప్రమత్తంగా ఉండి పోలీసులు డ్యూటీ చేశారని, మొన్నఎంపీ అర్వింద్ పై దాడి జరుగుతున్నప్పుడు ఇదే అప్రమత్తత పోలీసులకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అహంకారంతో, నియంతృత్వ విధానాలతో, నిరంకుశ ధోరణితో మాఫియా పాలన చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిలైతే..మరిపా సైందెవరు?

Latest Updates