తాలు పేరుతో రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నారు

తెలంగాణలో ఒక్కక్క జిల్లాలో ఒక్కక్క రకంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. రైతులను తాలు పేరుతో, ప్రతి క్వింటాకు 5కిలోల తరుగుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కొన్ని ఐకెపి సెంటర్లో తాలు మెషిన్లు ఉన్నా, జాలి లేకపోవడం వల్ల రైతులు మోసపోతున్నారని.. చాలా ఐకెపి సెంటర్లో 10 రోజుల క్రితమే ధాన్యం తీసుకొచ్చినప్పటికి, ఇప్పటికి కొనుగోలు ప్రారంభం కాలేదన్నారు.

దళారి వ్యవస్థతో రైతులను బెదిరించి, బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. నిరాకరించే రైతులపై దాడులకు యత్నించే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలన్న బండి సంజ‌య్.. మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు.

ప్రతి గ్రామంలో వి.ఏ.ఓ,మండల అగ్రికల్చర్ ఆఫీసర్లను పంట నష్టం జరిగిన ప్రాంతాలకు వెళ్లాలని అదేశించి, వాస్తవ పరిస్థితులను పంట నష్ట వివరాలను సేకరించి, వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని చెప్పారు. మూలిగ నక్కపై తాటి పండు పడ్డ చందంగా, ఇప్పటికే లాక్ డౌన్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్న రైతాంగానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక చేయూతనివ్వాలని.. లేని పక్షంలో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు బండి సంజ‌య్.

Latest Updates