ఏబీ ధమాకా..82 రన్స్ తో కోల్ కతాపై RCB గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌‌లో ఎలాగైనా విజేతగా నిలవాలన్న టార్గెట్‌‌తో జట్టు రూపురేఖలు మార్చుకొని బరిలోకి దిగిన రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు పదమూడో సీజన్‌‌లో  పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు బ్యాటుతో.. ఇటు బంతితో మాయ చేస్తోంది. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్టు స్టార్లు చెలరేగిపోతున్నారు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ తన ఖలేజా చూపిస్తే.. ఇప్పుడు ఏబీ డివిలియర్స్‌‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్‌‌) వంతొచ్చింది. గత రెండు ఇన్నింగ్స్‌‌ల్లో నిరాశ పరిచిన మిస్టర్‌‌360 ఈసారి సునామీ ఇన్నింగ్స్‌‌తో  రెచ్చిపోయాడు. స్లాగ్‌‌ ఓవర్లలో సెన్సేషనల్‌‌ బ్యాటింగ్‌‌తో విజృంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో షార్జా గ్రౌండ్‌‌ను ముంచెత్తి  జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆపై, స్పిన్నర్లు   వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (2/20), యజ్వేంద్ర చహల్‌‌ (1/12) మాయాజాలానికి పేసర్ల ప్రతిభ కూడా తోడవడంతో కేకేఆర్‌‌ను చిత్తు చేసిన ఆర్‌‌సీబీ లీగ్‌‌లో ఐదో విక్టరీ కొట్టింది. మరోవైపు వరుసగా రెండు విజయాల తర్వాత కోల్‌‌కతా మళ్లీ తడబడింది.  బౌలింగ్‌‌లో కట్టుతప్పిన ఆ జట్టు.. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పేలవ బ్యాటింగ్‌‌తో లీగ్​లో మూడో ఓటమి మూటగట్టుకుంది.

షార్జా: రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు ఖాతాలో మరో విజయం చేరింది. మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో మెప్పించిన కోహ్లీసేన సోమవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 82   పరుగుల తేడాతో  కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఏబీ ధాటికి ఆర్‌‌సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 రన్స్‌‌ చేసింది. ఓపెనర్లు ఆరోన్‌‌ ఫించ్‌‌ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 47), దేవదత్‌‌ పడిక్కల్‌‌ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 32), కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (28 బంతుల్లో 1 ఫోర్‌‌తో 33 నాటౌట్‌‌) కూడా రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌లో కోల్‌‌కతా   20 ఓవర్లలో 112/9  స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకుంది.  శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 34) టాప్‌‌ స్కోరర్‌‌. ఆర్‌‌సీబీ టీమ్‌‌లో ఆరుగురు బౌలర్లూ కనీసం ఒక్క వికెటైనా తీయడం విశేషం.

మెరుపు ఆరంభం.. మధ్యలో నిదానం

టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్‌‌సీబీకి ఓపెనర్లు ఆరోన్‌‌ ఫించ్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌ మెరుపు ఆరంభం ఇచ్చారు. పర్‌‌ఫెక్ట్ షాట్లతో బౌండ్రీలు రాబట్టి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సెకండ్‌‌ బాల్‌‌నే బౌండ్రీకి తరలించిన ఆరోన్‌‌.. ప్రసిధ్‌‌ బౌలింగ్​లో లాంగాన్‌‌ మీదుగా సిక్సర్‌‌తో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. మరోవైపు కమిన్స్‌‌ (0/38), ప్రసిధ్‌‌ (1/42) ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లతో పడిక్కల్‌‌ జోరు చూపడంతో పవర్‌‌ప్లేలో 47 రన్స్‌‌ వచ్చాయి. అలాగే, కేకేఆర్‌‌ ఫీల్డింగ్‌‌ తప్పిదాలు కూడా  ఓపెనర్లకు కలిసొచ్చాయి.  పవర్‌‌ప్లే లాస్ట్‌‌ బాల్‌‌కు ఫించ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను షార్ట్‌‌ ఫైన్‌‌లెగ్‌‌లో నాగర్‌‌కోటి డ్రాప్‌‌ చేశాడు. ఆపై, రసెల్‌‌ (1/51) బౌలింగ్‌‌లోనే  దేవదత్‌‌ ఇచ్చిన టఫ్‌‌ క్యాచ్‌‌ను ప్రసిధ్‌‌ అందుకోలేకపోయాడు. ఆ బాల్‌‌ రోప్‌‌ అవతల పడడంతో సిక్సర్‌‌ వచ్చింది. కానీ, అదే ఓవర్లో ఫుల్ లెంగ్త్‌‌ బాల్‌‌తో పడిక్కల్​ను క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేసిన రసెల్‌‌ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. అక్కడి నుంచి కేకేఆర్‌‌ బౌలర్లు పుంజుకున్నారు.  స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి (0/25), యంగ్‌‌ పేసర్‌‌ నాగర్‌‌కోటి  (0/36)పొదుపుగా బౌలింగ్‌‌ చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో  ఫించ్‌‌, కోహ్లీ  ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయారు. ముఖ్యంగా నాగర్‌‌కోటి వైవిధ్యమైన బౌలింగ్‌‌తో ఆకట్టుకున్నాడు. ఎదురుగా ఇద్దరు వరల్డ్‌‌ క్లాస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ ఉన్నా ఫుల్‌‌ కాన్ఫిడెన్స్‌‌తో బంతులు విసిరి వారిని అడ్డుకున్నాడు. 13వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన ప్రసిధ్‌‌కు ఫించ్‌‌ బౌండ్రీతో వెల్‌‌కమ్‌‌ చెప్పి స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, వెంటనే ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌తో అతడిని బౌల్డ్‌‌ చేసిన ప్రసిధ్‌‌ రివెంజ్‌‌ తీర్చుకున్నాడు.

కోల్‌‌కతా ప్యాకప్‌‌

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కోల్‌‌కతా ఏ దశలోనూ ఆర్‌‌సీబీకి పోటీ ఇవ్వలేకపోయింది. చిన్న గ్రౌండ్‌‌లో ఒక్కరు కూడా క్రీజులో నిలువలేకపోయారు. బెంగళూరు అద్భుత బౌలింగ్‌‌ ధాటికి పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. ఆ టీమ్‌‌కు  స్టార్టింగ్‌‌లోనే కేకేఆర్‌‌ షాక్‌‌ తగిలింది. ఫస్ట్‌‌ స్పెల్‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన నవ్‌‌దీప్‌‌ సైనీ (2/17) ఫోర్త్‌‌ ఓవర్లోనే గుడ్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌తో అరంగేట్రం ప్లేయర్‌‌ టామ్‌‌ బాంటన్‌‌ (8)ను బౌల్డ్‌‌ చేసి ఆర్‌‌సీబీకి ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. అయితే, మరో ఓపెనర్‌‌ గిల్‌‌.. సిరాజ్‌‌ (1/17)వేసిన తర్వాతి ఓవర్లో  4,6 బాదగా, వన్‌‌డౌన్‌‌లో వచ్చిన రాణా (9) ఓ బౌండ్రీ కొట్టడంతో  16 రన్స్‌‌ వచ్చాయి. దాంతో కెప్టెన్‌‌ విరాట్‌‌ రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు సుందర్‌‌, చహల్‌‌తో వరుసగా ఏడు ఓవర్లు వేయించి సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యాడు. కెప్టెన్‌‌ నమ్మకాన్ని ఇద్దరు స్పిన్నర్లూ నిలబెట్టారు.  సుందర్‌‌ వికెట్‌‌ టు వికెట్‌‌బౌలింగ్‌‌తో అదరగొట్టగా, చహల్‌‌ స్లో లెగ్‌‌ బ్రేక్‌‌, లో లెంగ్త్‌‌ బాల్స్‌‌తో బ్యాట్స్‌‌మెన్‌‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తర్వాతి ఏడు ఓవర్లలో వీళ్లు వరుసగా  4, 3, 5, 3, 7, 3, 5 రన్సే ఇచ్చి  నలుగురు బ్యాట్స్‌‌మెన్‌‌ను పెవిలియన్‌‌ చేర్చి ఆర్‌‌సీబీ విజయం ఖాయం చేశారు. ఎనిమిదో ఓవర్లో స్ట్రెయిట్‌‌ బాల్‌‌తో రాణాను బౌల్డ్‌‌ చేసిన సుందర్‌‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. తర్వాతి (చహల్‌‌) ఓవర్​ ఫస్ట్‌‌ బాల్‌‌కే గిల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను లాంగాన్‌‌లో ఫించ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. కానీ, సుందర్‌‌ బౌలింగ్‌‌లో  టైట్‌‌ సింగిల్‌‌ తీసే ప్రయత్నంలో గిల్‌‌ రనౌటవడంతో  పది ఓవర్లకు 61/2తో డీలా పడ్డ కోల్‌‌కతా  తిరిగి కోలుకోలేకపోయింది. చహల్‌‌ వేసిన స్లో లెగ్‌‌ బ్రేక్‌‌ను కెప్టెన్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌ (1) కాస్త లేట్‌‌గా కవర్‌‌ డ్రైవ్‌‌ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్‌‌ తీసుకున్న బాల్‌‌ వికెట్లను తగిలింది. ఆ వెంటనే సుందర్‌‌ లెంగ్త్‌‌ తగ్గించి వేసిన బాల్‌‌ను నేరుగా థర్డ్‌‌ మ్యాన్‌‌ ఉడాన చేతుల్లోకి కొట్టిన మోర్గాన్‌‌  (8)కూడా పెవిలియన్‌‌ చేరడంతో 12 ఓవర్లకు  కేకేఆర్‌‌ 69/5తో ఓటమి అంచుల్లో నిలిచింది.  ఆపై మోరిస్‌‌ బౌలింగ్‌‌లో రసెల్‌‌ (16) ఇచ్చిన ఈజీ క్యాచ్‌‌ను లాంగాన్‌‌లో పడిక్కల్‌‌ డ్రాప్‌‌ చేశాడు. దాంతో, ఉడాన బౌలింగ్‌‌లో వరుసగా 4, 6, 4 కొట్టిన ఆండ్రీ మ్యాచ్‌‌ను మలుపు తిప్పేలా కనిపించాడు. కానీ, మరో షాట్‌‌ ఆడిన అతను సిరాజ్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో కోల్‌‌కతా ఓటమి ఖాయమైంది.

చివర్లో డివిలయం’..

నాలుగో నంబర్‌‌లో వచ్చిన ఏబీ డివిలియర్స్‌‌ బౌండ్రీతో  ఖాతా తెరిచినా .. కోహ్లీ సింగిల్స్‌‌కే పరిమితం కావడంతో 15 ఓవర్ల 111/2తో నిలిచిన ఆర్‌‌సీబీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, ఈ టైమ్‌‌లో ఏబీ ఒక్కసారిగా తనలోని హిట్టర్‌‌ను నిద్రలేపాడు. తన మార్కు పవర్‌‌ఫుల్‌‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. నాగర్‌‌కోటి వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌తో ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చిన ఏబీ..  కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో కూడా  ఓ ఫోర్‌‌ రెండు సిక్సర్లు బాదాడు. ఆపై, రసెల్‌‌ ఓవర్లో  4, 6తో 23 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  ప్రసిధ్‌‌ వేసిన 19వ ఓవర్లో కోహ్లీ తన 25వ బాల్‌‌కు బౌండ్రీ రాబట్టాడు. ఇక, రసెల్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో ఏబీ మరో సిక్సర్‌‌, ఫోర్‌‌తో ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇవ్వడంతో ఆర్‌‌సీబీ భారీ స్కోరు చేసింది. అతని ధాటికి చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 83 రన్స్‌‌ వచ్చాయి. మరోవైపు ఆండ్రీ రసెల్‌‌ ఏకంగా 51 రన్స్‌‌ ఇచ్చుకోవడం గమనార్హం.

Latest Updates