నెల రోజుల్లో ఖరీఫ్.. రైతు రుణాలివ్వని బ్యాంకులు

ఈ ఏడాది కూడా రైతులకు అప్పులిచ్చేందుకు బ్యాంకులకు చేతులురావడం లేదు. అరకొర విదిలించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రుణం కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు.. ‘ముందు పాత అప్పు వడ్డీతో సహా కట్టి కొత్త అప్పు తీసుకొండి’ అంటూ సలహాలిస్తున్నాయి. దీంతో రైతులు ఈ వానాకాలం సీజన్‌‌‌‌ గట్టెక్కేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా వానాకాలం సాగు జరుగుతుంది. ఏటా నాబార్డు భారీ లక్ష్యాలను నిర్ధేశించడం, బ్యాంకులు అరకొర అప్పులిచ్చి చేతులు దులుపుకోవడం మామూలైపోయింది. ఈ ఏడాది కూడా వ్యవసాయ, అనుబంధ రంగాలకు లక్షకోట్ల రూపాయల రుణాలివ్వాలని బ్యాంకులకు నాబార్డ్‌‌‌‌ భారీ లక్ష్యం పెట్టింది. ప్రభుత్వం కూడా బ్యాంకర్లతో మీటింగ్స్‌‌‌‌ పెట్టి రుణ ప్రణాళిక అమలు చేయాలని గట్టిగా సూచించింది. అయినా రైతులకు అప్పులిచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు.

‘రైతు బంధు’ సరిపోతుందా?

గత ఏడాది నుంచి ప్రభుత్వం ‘రైతుబంధు’ అమలు చేస్తున్నా అది చిన్న కమతాలున్న రైతులకు ఉపయోగపడడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు నాలుగైదు ఎకరాల్లోపు  ఉన్న వారే. వీరందరికీ బ్యాంకులిచ్చే రుణాలే దిక్కు. అవి సకాలంలో అందితేనే పొలం పనులు ప్రారంభిస్తారు.  జూన్‌‌‌‌లో వానాకాలం (ఖరీఫ్‌‌‌‌) సీజన్‌‌‌‌ ప్రారంభమవుతుంది. దున్నకం, విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో రుణం చేతికందితే ఇబ్బంది ఉండదు. ఏ మాత్రం బ్యాంకులు సతాయించినా వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. గతంలో అప్పు తీసుకుని వాటిని చెల్లించలేని రైతులు వానాకాలంలో బంగారు నగలను పెట్టి రుణం తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే నగలు కుదువ పెట్టిన రైతులకు మరో దారిలేక అధిక వడ్డీకి బయట అప్పులు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా నాబార్డు రుణపరిమితిని పది నుంచి 15 శాతానికి పెంచినా బ్యాంకులు ఆ మేరకు మంజూరు చేయడం లేదు. గత ఏడాది పంట రుణ లక్ష్యం రూ.58063.68 కోట్లు కాగా బ్యాంకులు రైతులకు ఇచ్చింది కేవలం రూ.45029.06 కోట్లు. అంటే 77.55 శాతం అన్నమాట.

 

Latest Updates