బేస్​క్యాంప్​ ఉద్యోగులు రోడ్డున

1500 మంది తొలగింపు
వేతనాలిచ్చేందుకు కాంపా స్కీం ఉన్నా దయ చూపని సర్కారు
ఈ ఏడాది కేంద్రం నుంచి రూ. 3100 కోట్ల నిధులు
ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు

ఆదిలాబాద్, వెలుగు20 ఏండ్లుగా అడవిని, వన్యప్రాణులను స్మగ్లర్లు, వేటగాళ్ల బారి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బేస్​క్యాంపు సిబ్బందిని రాష్ట్ర సర్కారు ఒక్క కలం పోటుతో తొలగిం    చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఔట్​సోర్సింగ్ విధానంలో 3,600 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 1500 మందిని గుట్టుచప్పుడు కాకుండా తీసేసింది. ఎంతో ఆసరాగా ఉన్న ఉద్యోగాలు పోవడంతో పేద, గిరిజన కుటుంబాలకు రోడ్డున పడ్డాయి. వీరికి జీతాలు కూడా కేంద్రం ఇచ్చే కాంపా ఫండ్స్‌‌‌‌ నుంచి ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడడం లేదు. అయినా సరే కనీస దయ లేకుండా వారిని తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అటవీశాఖలో 1800 మంది కొత్తగా చేరారు వారిలో కొందరితో బేస్‌‌‌‌క్యాంప్ తరహా పనులు చేయించుకోవాలని ఉన్నతాధికారు యోచిస్తున్నట్టు సమచారం.

కాంపా స్కీం నుంచి వేతనాలు

ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవడంతోపాటు మొదట్లో చాలా తక్కువ వేతాలు ఇచ్చినప్పటికీ అడవుల్లో ఉండే పేద, గిరిజనులు బేస్​క్యాంప్ ఉద్యోగులగా చేరారు. ప్రస్తుతం వారికి నెలకు రూ. 7,100 చొప్పున అందజేస్తున్నారు. బేస్ క్యాంపుల్లో ఉంటూ స్మగ్లర్లు, వేటగాళ్ల బారి నుంచి చెట్లను, వన్యప్రాణులను రక్షించడం  వీరి ప్రధాన బాధ్యత. స్మగ్లర్లు, వేటగాళ్లకు సహకరించేవారి సమాచారాన్ని ఎప్పటికప్పుడుపై అధికారులకు చేరవేసేవారు. స్థానికులు, గిరిజనులు కావడంతో వీరికి అడవి కొట్టిన పిండి. అది అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఎంతగానో దోహదపడింది. వీరికి అడవుల రక్షణకు కేంద్ర సర్కారు ఇచ్చే కంపన్సేటరీ అఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్‌‌‌‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్(కంపా) కింద వేతనాలు చెల్లించేవారు. ఈ ఏడాది కూడా కేంద్రం కాంపా కింద రూ.3100 కోట్ల నిధులను మంజూరు చేసింది.

వాకింగ్ టెస్ట్‌‌‌‌లంటూ..

20 ఏళ్లుగా పనిచేస్తున్న వీరిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రారంభించింది. వాకింగ్ టెస్ట్ పెట్టి అందులో పాస్‌‌‌‌ అయిన వారినే తీసుకుంటామని అటవీశాఖ ప్రకటించింది. ఇందుకు ఉద్యోగులు ఒప్పుకోలేదు. పోలీస్, మిగతా యూనిఫామ్‌‌‌‌ సిబ్బందికి లేని నిబంధన తమకు ఎందుకని వాదించారు. అయితే అధికారులు ఈ టెస్ట్‌‌‌‌తో సంబంధం లేకుండా 1500 మందిని తొలగించారు. తొలుత ఆదిలాబాద్, తర్వాత నిజామాబాద్, కరీంనగర్​ జిల్లాల్లో ఉద్యోగాలు తీసేసిన అధికారులు, తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పనిచేశారు.

నిధులను మళ్లించేందుకేనా?

ఏటా రాష్ట్రానికి పెద్దమొత్తంలో కంపా నిధులు వస్తున్నాయి. వాటిని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ఉపయోగించాలి. ప్రాజెక్టులు, రోడ్డు పనులు, పోడు వ్యవసాయం కారణంగా అటవీసంపద నాశనమైతే, ఆయా ప్రాంతాల్లో తిరిగి అడవిని తయారుచేసేందుకు కంపా నిధులను వినియోగించాలనేది లక్ష్యం. బేస్‌‌‌‌క్యాంప్ సిబ్బంది కూడా ప్రధానంగా ఇవే విధులు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా అడవిని పెంచుతున్నారు. ఇందుకోసం కంపా నిధుల్లోంచి కొంత మొత్తాన్ని థర్డ్ పార్టీ ద్వారా వారికి చెల్లిస్తున్నారు. అయితే ఈ నిధులను హరితహారం, మిషన్​ భగీరథ లాంటి పథకాలకు మళ్లించేందుకే వీరిని తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మాకు న్యాయం చేయాలె..

నేను చాలా సంవత్సరాలుగా బేస్​క్యాంప్ ఉద్యో గిగా పనిచేస్తున్నా. ఇపుడు ఉన్నఫళంగా మా ఉద్యోగాలు తొలగించడం సరికాదు. ఇన్నాళ్లూ అడవులను కాపాడుకుంటూ వచ్చినం. తీరా ఇప్పుడు మా కుటుంబాలను రోడ్డున పడేయ డం అన్యాయం. సర్కారే న్యాయం చేయాలె.- దందిరె ప్రకాశ్, సిర్పూర్ రేంజ్ బేస్ క్యాంప్ ఉద్యోగి

తొలగించడం అన్యాయం

ఎన్నో ఏండ్ల నుంచి అడవుల రక్షణ కోసం పనిచేస్తున్నాం. ఇపుడు కొత్త రూల్స్​ పెట్టి తొలగించడం అన్యాయం. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రన్నింగ్ చేయమంటే ఎట్లా? మ మ్ముల తీసేసేందుకే ఈ కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ పెట్టిన్రు. మానవతా కోణంలో ఆలోచించి రోడ్డున పడ్డ మమ్ములను మళ్ల డ్యూటీలోకి తీసుకోవాలి.- నారపాక స్వామి, బేస్ క్యాంపు వాచర్​

వాకింగ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు హాజరుకానందుకే..

బేస్ క్యాంప్ సిబ్బంది వాకింగ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు హాజరుకావాలని ఆదేశించాం. కానీ వారు దాన్ని పట్టించుకోకపోవడంతో తొలగించాం. వారి స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తాం.- ప్రభాకర్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో, ఆదిలాబాద్

Latest Updates