కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని : భట్టి

హైదరాబాద్‌, వెలుగు‘ప్రజల్ని మోసం చేస్తూ దోపిడీ చేస్తున్న సన్నాసివి నువ్వు. రోజుకో మాట, పూటకో మాట చెప్పే దద్దమ్మవు. రాష్ట్రానికి శనిలా దాపురించావు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టిన వాళ్లు సన్నాసులా? లేక కాళేశ్వరం రీ డిజైన్‌ పేరుతో రూ. 80 వేల కోట్లు ఖర్చు పెట్టి చుక్క నీరు కూడా ఇవ్వని నువ్వు సన్నాసివా?’ అంటూ కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.  ‘గోదావరిలో వరదొచ్చి నీళ్లొచ్చినా నీ పనితనమే అంటివి’ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో శుక్రవారం భట్టి మాట్లాడారు. ‘తలకాయ ఉన్న వాడెవడైనా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటాడు. జీరో నుంచి 3 శాతం వడ్డీకి రుణాలిచ్చే ఆర్థిక సంస్థలుండగా కేసీఆర్‌ మాత్రం కమర్షియల్‌ బ్యాంకుల నుంచి 11 శాతం వడ్డీకి రూ. లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు’ అని ఆరోపించారు. ‘కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్లు, మిషన్‌ భగీరథ కోసం రూ. యాభై వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. వేరే అప్పులు మరో రూ. లక్ష కోట్లున్నాయి. పదేళ్లలో ఈ రెండున్నర లక్షల కోట్లకు వడ్డీతో కలిపి రీ పేమెంట్‌ చేస్తే రూ. 5 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది’ అని అన్నారు.

అనవసరంగా దూరితే అంతే

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కాల్చినా తప్పులేదన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ‘రేవంత్‌ ఆరోపణల్లో తప్పులున్నాయా? దీనిపై సంబంధిత మంత్రో, ముఖ్యమంత్రో స్పందించాలి. ప్రభాకర్‌రావు ఎవరు? ఆయనకేం సంబంధం? రాజకీయ ఆరోపణలకు అధికారులు సమాధానాలిస్తారా? అనవసరంగా దూరితే అంతే’ అన్నారు.

Latest Updates