తీరొక్క పూల..  పండుగొచ్చింది

V6 Velugu Posted on Oct 06, 2021

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలు బుధవారం ఎంగిలి పూలతో మొదలు కానున్నాయి. గునుగు, తంగేడు, బంతి, చేమంతి.. ఇట్ల తీరొక్క పూలతో ఆడబిడ్డలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడనున్నారు. పూలపండుగ మొదలైంది. ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్లకు పెద్ద సంబురం. రంగు రంగుల, రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తరు.కొత్త కొత్త చీరలు, నగలు పెట్టుకుని చందమామ లెక్క రెడీ అయితరు. ‘ ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతరు. ప్రపంచం మొత్తం తెలంగాణవైపు చూసేలా పండుగ చేస్తరు. గౌరమ్మకు పూజలు చేసి, ప్రసాదాలు పెడతరు. ‘పోయిరా గౌరమ్మ’ అంటూ సాగ నంపుతరు.

గణపతి నవరాత్రుల ధూంధాం అయిపోయింది. ఆ తర్వాత వచ్చే అమాస తెలంగాణలో  ప్రత్యేకం. దాన్నే పెత్తరమాస అంటరు. ఆ రోజునే షురూ అయితది బతుకమ్మ సంబురం. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను అలంకరిస్తరు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటరు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో పూర్తైతది ఈ పండుగ.
పల్లెల్లో సంబురం
తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతయ్‌‌. పెళ్లై అత్తగారింటికి వెళ్లిన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి.. స్వయానా బతుకమ్మను పేరుస్తరు. మంచి పాటలు పాడుకుంట, చప్పట్లు కొడుతూ పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతు బతుకమ్మ ఆడతరు. ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు.. ఇలా ఎన్నెన్నో వివరిస్తుంటారు.
రంగురంగుల పూలు
బతుకమ్మను పేర్చేందుకు మగవాళ్లు పొలం గట్లెంబడి పోయి తంగేడు, మందారం, బంతి, సీతజడలు, తామర పూలతో పాటు ఇంకా ఎన్నో రకాల పూలు తెస్తరు. వాటితో ఇంట్లోని ఆడవాళ్లు బతుకమ్మను పేరుస్తరు.  
ఒక్కోరోజు ఒక్కో ప్రసాదం  
బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతరు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తరు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ రోజు పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం లాంటివి చేస్తరు. బతుకమ్మకు పెట్టే సత్తుపిండి పిల్లలు ఎంతో ఇష్టంగ తింటరు.  ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మ అలుగుతుందని చెప్తరు పెద్దవాళ్లు. అందుకే ఆరో రోజు బతుకమ్మను చేయరట. 
తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లు
బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తరు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటరు. రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ అంటరు. ఆరో రోజున అలిగిన బతుకమ్మ అని పిలుస్తరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తరు. చివరి రోజు ఆశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మను జరుపుకుంటరు. 
ఎంగిలి పూల బతుకమ్మ ప్రసాదం


నువ్వుల సత్తుపిండి 
కావాల్సినవి: 
నువ్వులు – ఒక కప్పు
యాలకులు – మూడు 
బెల్లం – 1/3 కప్పు
తయారీ:  కడాయి వేడిచేసి నువ్వులు వేసి వేగించి చల్లార బెట్టాలి. తర్వాత నువ్వులు, యాలకులు వేసి మెత్తటి పొడి‌‌ చేయాలి. మిక్సీజార్‌‌‌‌లో కొంచెం నువ్వుల పౌడర్‌‌‌‌ ఉంచి, దాంట్లోనే బెల్లం వేసి మరోసారి గ్రైండ్‌‌‌‌ చేసి నువ్వుల పొడిలో కలపాలి.

Tagged Telangana, Festival, Batukamma,

Latest Videos

Subscribe Now

More News