సెక్రటేరియెట్‌‌ కాదు.. హాస్టళ్లు కట్టాలి

సెప్టెంబర్‌‌ 22న విద్యార్థి సమర శంఖారావం: కృష్ణయ్య

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కట్టాల్సింది సెక్రటేరియెట్‌‌, అసెంబ్లీ బిల్డింగులు కాదని.. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌‌. కృష్ణయ్య అన్నారు. స్టూడెంట్ల సమస్యలపై హైదరాబాద్‌‌లో సెప్టెంబర్‌‌ 22న నిర్వహించనున్న సమర శంఖారావం పోస్టర్‌‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకులాల సంక్షేమ హాస్టళ్లకు వెంటనే సొంత బిల్డింగులు కట్టాలని డిమాండ్‌‌ చేశారు. స్టూడెంట్‌‌ పే కమిషన్‌‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, విద్యాసంవత్సరం ప్రారంభంలో మెస్‌‌ చార్జీలు, స్కాలర్‌‌షిప్స్‌‌ పెంచే అధికారం కమిషన్‌‌కు ఇవ్వాలన్నారు. గురుకుల బాయ్స్‌‌ డిగ్రీ కాలేజీలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించాలని కోరారు. ప్రతి సంక్షేమ హాస్టల్‌‌లో ఓ హెల్త్‌‌ సూపర్‌‌వైజర్‌‌ను నియమించాలన్నారు. సమర శంఖారావానికి కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ రేవంత్‌‌రెడ్డి, జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్‌‌ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరవుతారని చెప్పారు.

Latest Updates