ఖాళీ స్టేడియాల్లో ఆటలొద్దు!

చెన్నై:  కరోనా దెబ్బకు  ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల స్పోర్ట్స్​ ఆగిపోయాయి. దాదాపు నెల రోజుల నుంచి ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమవగా..  జర్మనీకి చెందిన ప్రముఖ ఫుల్​బాల్​ లీగ్ బండెస్‌‌లీగా  వచ్చే నెలలో  తమ సీజన్‌‌ను స్టార్ట్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఖాళీ స్టేడియంలో జరగబోయే ఈ లీగ్​.. కరోనా వచ్చిన తర్వాత తిరిగి మొదలయ్యే తొలి టోర్నీ కానుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తగ్గితే   మనదేశంలోనూ ఖాళీ స్టేడియాల్లో  పోటీలను పున:ప్రారంభించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్, ఫుట్​బాల్​ కోసం ఫ్యాన్స్​ ఎదురు చూస్తున్నారు. అయితే, బీసీసీఐ, ఆలిండియా ఫుట్​బాల్​ఫెడరేషన్​ (ఎఐఎఫ్​ఎఫ్) మాత్రం ఖాళీ స్టేడియాల్లో ఆటకు నో అంటున్నాయి.  జర్మనీకి ఇండియాకు చాలా తేడా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్​ గంగూలీ అన్నాడు. ‘జర్మనీలో సోషల్​ రియాలిటీకి ఇండియాకు చాలా డిఫరెన్స్​ఉంది. సమీప భవిష్యత్తులో ఇండియాలో క్రికెట్​ ఉండదు. ఇప్పుడు చాలా విషయాల్లో అనేక అడ్డంకులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలకు రిస్క్ ఉన్నప్పుడు స్పోర్ట్స్​ అవసరం ఉండదని నేను నమ్ముతా’ అని దాదా స్పష్టం చేశాడు.  ఇక, ఇండియాలో టాప్ ​క్రికెటర్ల క్రేజ్ స్టేడియాలకు మాత్రమే పరిమితం కాదని హర్భజన్  సింగ్​ అన్నాడు.

‘ఐపీఎల్​ టీమ్స్​ ట్రావెల్​ చేస్తున్నప్పుడు ఎయిర్​ పోర్ట్స్, హోటల్స్, స్టేడియాల బయట చాలా మంది ప్రజలు ఉంటారు. సోషల్​ డిస్టెన్స్​మెయింటేన్ చేయడం కోసం వారందరినీ ఎలా కంట్రోల్​ చేస్తారు?  అందువల్ల  కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మ్యాచ్‌‌లు నిర్వహించొద్దు’ అని అభిప్రాయపడ్డాడు.  ఐపీఎల్​ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా కూడా తమకు అభ్యంతరం లేదని బ్రాడ్​కాస్టర్ అంటున్నా.. ఈ సమయంలో అలా చేయడం బాగుండదని  సీఎస్కే ఫ్రాంచైజీ  సీఈవో కేఎస్ విశ్వనాథన్​ అన్నారు.

అనుమతిస్తే చాన్స్ వదలొద్దు: భుటియా

ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్​పై నీలినీడలు కమ్ముకోగా.. ఇండియా ఫుట్​బాల్​ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్​భుటియా మాత్రం మరో వాదన వినిపిస్తున్నాడు. కరోనా తగ్గిన వెంటనే… ఫ్యాన్స్​లేకున్నా ఫుట్​బాల్​ను స్టార్ట్​ చేయాలని అంటున్నాడు. ‘ఇప్పుడు టీవీలో టెలీకాస్ట్ చేసేందుకు స్పోర్ట్స్​ ఏమీ లేవు. ఇలాంటి టైమ్‌‌లో  ఎక్కువ మంది వీవర్లను  ఆకట్టుకునేందుకు ఇండియా ఫుట్​బాల్‌‌కు ఇది మంచి అవకాశం. క్రైసిస్ ఉన్నప్పుడు స్పోర్ట్‌‌ను స్టార్ట్ చేయాలని నేను అనడం లేదు. కానీ, ఎమ్టీ స్టాండ్స్‌‌లో ఆటకు గవర్నమెంట్​ అనుమతిస్తే మాత్రం ఆ చాన్స్‌‌ను మిస్సవకూడదు’ అని భుటియా అభిప్రాయపడ్డాడు. అయితే, ఏఐఎఫ్​ఎఫ్​ వైస్ ప్రెసిడెంట్​ సుబ్రతా దత్తా మాత్రం.. భుటియాతో విభేదించారు. ‘ఎమ్టీ స్టాండ్స్​లో నిర్వహించినా.. టీవీ సిబ్బంది, జర్నలిస్టులు సహా స్టేడియంలో కనీసం వంద మంది ఉంటారు. వారిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు ఉండవు అనడానికి గ్యారంటీ ఏమిటి?  ఏదైనా జరిగితే స్టేడియం మొత్తాన్ని సీజ్ చేస్తారు. అలాగే ఇండియన్​ ఫుట్​బాల్​కు అభిమానులే ప్రాణదాతలు అన్న విషయం మర్చిపోకూడదు. టిక్కెట్ల విక్రయం కూడా ఇక్కడ ముఖ్యమైనదే’ అని అన్నారు.

 

Latest Updates