ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన

వరల్డ్‌‌కప్‌‌ కోసం ఇంగ్లండ్‌‌లో ఉన్న టీమిండియా భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆటగాళ్లపై భద్రతపై ఐసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ‘హెడింగ్లేలో జరిగిన ఘటన ఆమోదయోగ్యం కాదు. సెమీస్‌‌ మ్యాచ్‌‌ అప్పుడు ఇలాంటి ఘటన జరిగితే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. క్రికెటర్ల భద్రతే మా తొలి ప్రాధాన్యం’ అని బీసీసీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. లంకతో మ్యాచ్‌‌ జరుగుతుండగా ‘జస్టిస్‌‌ ఫర్‌‌ కాశ్మీర్‌‌, ఇండియా స్టాప్‌‌ జినోసైడ్‌‌ ఫ్రీ కాశ్మీర్‌‌, హెల్ప్‌‌ ఎండ్‌‌ మాబ్‌‌ లించింగ్‌‌’  అని వేర్వేరుగా రాసి ఉన్న బ్యానర్లు కలిగిన ఎయిర్‌‌ క్రాఫ్ట్స్‌‌ స్టేడియం మీదుగా వెళ్లాయి. అంతకముందు  పాకిస్థాన్‌‌, అఫ్గానిస్థాన్‌‌ మ్యాచ్‌‌ సందర్భంగా కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ఐసీసీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌‌గా తీసుకుంది.  టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌‌లకు వేదికలైన  ఓల్డ్‌‌ ట్రాఫోర్డ్‌‌, ఎడ్జ్‌‌బాస్టన్‌‌ను నో ఫ్లై జోన్‌‌గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.