దిగొచ్చిన క్రికెట్‌ పెద్దన్న! నాడా పరిధిలోకి బీసీసీఐ

  • నాడా పరిధిలోకి బీసీసీఐ
  • క్రికెటర్లను పరీక్షించేబాధ్యత ఇకపై నాడాదే
  • అంగీకరిస్తూ  సంతకంచేసిన సీఈఓ జోహ్రి
  • నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్‌‌ కానున్న బోర్డు
  • ఆర్థిక స్వయం ప్రతిపత్తి కొనసాగింపు

మాది  స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.  ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోవడం లేదు. అలాంటప్పుడు నేషనల్‌‌ యాంటీ డోపింగ్‌‌ ఏజెన్సీ కిందకు మేమెందుకు రావాలి?.  నాడాపై మాకు నమ్మకం లేదు. మా క్రికెటర్లను మేమే పరీక్షించుకుంటాం. మాపై కేంద్ర క్రీడా శాఖ పెత్తనాన్ని అస్సలు సహించం’…  నాడా పరిధిలోకి వచ్చేందుకు ససేమిరా అంటూ బీసీసీఐ ఎన్నో ఏళ్లుగా చెబుతున్న కారణాలివి. చివరకు ఐసీసీ చెప్పినా కూడా  ‘క్రికెట్‌‌ పెద్దన్న’ వినలేదు.  అయితే, ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్టుండి నాడాకు బోర్డు జై కొట్టింది. ఇకపై దేశ క్రికెటర్లందరినీ ఎప్పుడైనా, ఎక్కడైనా నాడా పరీక్షించనుందని కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి చేసిన ప్రకటన.. బీసీసీఐని కుదిపేసింది!  నాడా పరిధిలోకి వచ్చే విషయంలో బోర్డుపై క్రీడా శాఖ ఒత్తిడి తెచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి!  బీసీసీఐ సీఓఏ, సీఈఓ అసమర్థత.. యువ క్రికెటర్‌‌ పృథ్వీ షా డోపింగ్‌‌ కేసు విచారణపై వివాదం వల్లే  ‘నాడా’తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోర్డు అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు!

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌‌లో పెద్దన్న, వేల కోట్ల ఆదాయంతో ఇండియా క్రీడా రంగంలో మకుటం లేని మహారాజుగా వర్థిల్లుతున్న బీసీసీఐ..  చట్టం ముందు తలొగ్గక తప్పలేదు.  నేషనల్‌‌ యాంటీ డోపింగ్‌‌ ఏజెన్సీ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు  చాలా ఏళ్లుగా నిరాకరిస్తూ వస్తున్న  బీసీసీఐ ఎట్టకేలకు దిగివచ్చింది. నాడా నిబంధనలు పాటించేందుకు అంగీకరిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దాంతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీసీఐ కూడా ఒక  నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఎఫ్‌‌)గా మారేందుకు తొలి అడుగు పడింది. అయితే, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని మాత్రం బోర్డు కోల్పోవడం లేదు.  నాడా డీజీ నవీన్‌‌ అగర్వాల్‌‌తో కలిసి  బీసీసీఐ సీఈఓ రాహుల్‌‌ జోహ్రి, జీఎమ్‌‌ (క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌) సబా కరీంతో సమావేశమైన కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి రాధేశ్యామ్‌‌ జులానియా.. చర్చల అనంతరం నాడా యాంటీ డోపింగ్‌‌ పాలసీని అంగీకరిస్తున్నట్టు బోర్డు లిఖిత పూర్వంగా తెలిపిందని శుక్రవారం ప్రకటించారు. ఇకపై  క్రికెటర్లందరినీ నాడా పరీక్షిస్తుందని తెలిపారు. డోప్‌‌ టెస్టింగ్‌‌ కిట్ల నాణ్యత, పాథాలజిస్టుల సామర్థ్యం, శాంపిల్‌‌ కలెక్షన్‌‌ విషయాల్లో బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసిందని జులానియా తెలిపారు. బోర్డు కోరిన సౌకర్యాలను తాము
కల్పిస్తామన్నారు. అందుకయ్యే ఖర్చును మాత్రం బీసీసీఐనే భరించాల్సి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అన్ని ఎన్‌‌ఎస్‌‌ఎఫ్‌‌లకు అత్యున్నత ప్రమాణాలు ఒకే రకంగా ఉంటాయని, మిగతా వాటి కంటే బీసీసీఐ ప్రత్యేకం ఏమీ కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు. చట్టానికి బీసీసీఐ కట్టుబడుతుందని బోర్డు సీఈవో రాహుల్‌‌ జోహ్రి తెలిపారు. డోప్‌‌ పరీక్షల విషయంలో తమ సందేహాలను క్రీడా శాఖ నివృత్తి చేసిందని చెప్పారు. కాగా, ఇప్పటిదాకా స్వీడన్‌‌ కేంద్రంగా పని చేసే ఇంటర్నేషనల్‌‌ డోప్‌‌ టెస్టింగ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (ఐడీటీఎమ్‌‌) ఇండియా క్రికెటర్ల శాంపిల్స్‌‌ను సేకరించి వాటిని నేషనల్‌‌ డోప్‌‌ డెస్టింగ్‌‌ లాబొరెటరీ (ఎన్‌‌డీటీఎల్‌‌)కు అప్పగించేది. అయితే, ఐటీడీఎమ్‌‌ ఇకపై నాడా  ఏజెన్సీ అవుతుందని జులానియా ప్రకటించారు.

ఒత్తిడి తెచ్చిన క్రీడా శాఖ

బీసీసీఐని నాడా పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ  కాస్త కఠినంగా వ్యవహరించింది. ఈ ఏడాది మార్చిలో నాడా, ఐసీసీతో  పలు షరతులతో కూడిన ఒప్పందానికి బోర్డు అంగీకరించింది. కానీ, క్రీడా శాఖ సమ్మతి లేకుండా ఒక ప్రభుత్వ సంస్థతో ఒప్పందంపై బీసీసీఐ సంతకం చేయలేదని జులానియా స్పష్టం చేయడంతో  బోర్డు ఇరకాటంలో పడింది. అదే సమయంలో  ఇండియా టూర్‌‌కు వచ్చే సౌతాఫ్రికా–ఎ, మహిళల జట్లకు క్లియరెన్స్‌‌ ఇవ్వడంలో కావాలనే జాప్యం చేసి బోర్డుపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. యాంటీ డోపింగ్‌‌ పాలసీకి అంగీకరిస్తేనే క్లియరెన్స్‌‌ ఇస్తామని చెప్పినట్టు సమాచారం. చేసేదేం లేక..  కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) సూచనతో సీఈవో రాహుల్‌‌ జోహ్రీ ఒప్పందంపై సంతకం చేశారు.

సీనియర్‌‌ అధికారుల గుస్సా

ప్రస్తుత పరిణామాలపై బోర్డులోని పలువురు సీనియర్‌‌ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బోర్డు తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం సీఈఓకు గానీ, సీఓఏకు గానీ లేదు. ప్రస్తుతం బోర్డు పరిపాలన వాళ్లదే కాబట్టి ఎలాంటి లేఖనైనా రాయొచ్చు,  ఎలాంటి  నిర్ణయాన్ని అయినా అమలు చేయొచ్చు. అంతమాత్రాన అది అధికారిక నిర్ణయం కాబోదు’ అని సీనియర్‌‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

స్టార్‌‌ ప్లేయర్లఆచూకీచెప్పడంపైనే ఆందోళనంతా!

నాడా కిందకు వచ్చేందుకు బోర్డు ఇన్నాళ్లు ససేమిరా అనడానికి చాలా కారణాలు ఉన్నా అందులో ప్రధానమైనది  ‘వేర్‌‌ అబౌట్స్‌‌’ క్లాజ్‌‌(ఆచూకీ తెలిపే నిబంధన).  ఈ నిబంధన ప్రకారం  స్టార్‌‌ ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో తాము ఎక్కడ ఉంటామో నాడాకు తెలపాలి. అలాగే,  ఏడాదిలో మూడుసార్లు డోపింగ్‌‌ పరీక్షలకు హాజరుకావాలి.  అందుకోసం ఆ ఏడాదిలో  మూడు తేదీలను ఇస్తే.. ఆ రోజుల్లో నాడా డోప్‌‌ కంట్రోల్‌‌ ఆఫీసర్లు ప్లేయర్ల శాంపిల్స్‌‌  కలెక్ట్‌‌ చేసుకుంటారు. ఒకవేళ చెప్పిన తేదీల్లో  డోప్‌‌ టెస్ట్‌‌కు హాజరు కాకపోతే.. వాడా నిబంధనల ఉల్లంఘన కింద ప్లేయర్లపై చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు వెస్టిండీస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ఆండ్రీ రసెల్‌‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. డోప్‌‌ టెస్ట్‌‌కు గైర్హాజరవడంతో జమైకా యాంటీ డోపింగ్‌‌ ఏజెన్సీ అతనిపై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ‘వేర్‌‌ అబౌట్స్‌‌’ క్లాజ్‌‌ను పాటిస్తే … టాప్‌‌ క్రికెటర్ల  ప్రైవసీకి భంగం కలుగుతుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

కొంపముంచిన పృథ్వీ కేసు!

చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీసీసీఐ ఉన్నట్టుండి నాడాతో చేతులు కలపడానికి  సీఓఏ, సీఈఓ పరిపాలన వైఫల్యమే కారణమని బోర్డు అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. అలాగే, డోప్‌‌ టెస్ట్‌‌లో విఫలమైన యువ క్రికెటర్‌‌ పృథ్వీ షా కేసును సరిగ్గా హ్యాండిల్‌‌ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమే బోర్డు కొంపముంచిందని తెలుస్తోంది. ఏప్రిల్‌‌లోనే షా డోప్‌‌ టెస్ట్‌‌లో విఫలమైనప్పటికీ ఐపీఎల్‌‌ ఆడడం, ఎన్‌‌సీఏలో ట్రెయినింగ్‌‌ తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ముంబై లీగ్‌‌, ఐపీఎల్‌‌లో ఆడించేందుకే  కేసును ఆలస్యం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును వాడా తిరగదోడుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.  ఈ కేసులో విచారణను తప్పించుకోవడం కోసమే నాడాతో కలిసేందుకు సీఈఓ ఒప్పుకున్నారని ఓ అధికారి ఆరోపించారు.