సూపర్‌ సిరీస్‌పై ముందుకా.. వెనక్కా?

ఏడాదికో ఇంటర్నేషనల్‌‌ టోర్నమెంట్ నిర్వహించాలన్న ఐసీసీ ప్లాన్‌‌కు కౌంటర్‌‌గా నాలుగు దేశాల సూపర్‌‌ సిరీస్‌‌ను ప్రతిపాదించిన బీసీసీఐ బాస్‌‌ సౌరవ్‌‌ గంగూలీ స్వరం మార్చాడు. ఇండియా, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, మరో జట్టుతో కలిపి ఏడాదికో వన్డే సిరీస్‌‌ నిర్వహించాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాడు. ఇది ప్రతిపాదన మాత్రమే అని, ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదన్నాడు. ఇది కార్యరూపం దాల్చాలంటే మరికొంత సమయం పడుతుందని చెప్పాడు. ఈ సూపర్‌‌ సిరీస్‌‌ను 2021 నుంచి ప్రతి ఏడాది నిర్వహించాలని, ఆతిథ్య హక్కులను బిగ్‌‌ త్రీ (ఇండియా, ఇంగ్లండ్‌‌, ఆసీస్‌‌) రొటేషన్‌‌ పద్ధతిలో పంచుకోవాలని దాదా గత వారం ప్రపోజ్‌‌ చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్‌‌ అండ్‌‌ వేల్స్‌‌ క్రికెట్‌‌ (ఈసీబీ)తో సమావేశమై తన ఆలోచనను వారితో పంచుకున్నాడు. దీనికి ఇంగ్లండ్‌‌ బోర్డు కూడా ఓకే చెప్పింది. గంగూలీ, బీసీసీఐకి సపోర్ట్‌‌ చేస్తామని, ఐసీసీ మెంబర్స్‌‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మంగళవారం  ప్రకటించింది.  ఈ సమయంలో దాదా వెనక్కు తగ్గడం చర్చనీయాంశమైంది. ఐసీసీ రూల్స్‌‌ ప్రకారం.. తమ అనుమతి లేకుండా మూడు కంటే ఎక్కువ సభ్య దేశాలు కలిసి ఒక టోర్నీని నిర్వహించకూడదు. అలా చేస్తే ఫ్యూచర్‌‌ మెంబర్స్‌‌ పార్టిసిపేషన్‌‌ అగ్రిమెంట్‌‌ (ఎమ్‌‌పీఏ)ను ఉల్లంఘించినట్టు అవుతుంది.

ఐసీసీకి కౌంటర్‌‌ ఇచ్చేందుకేనా..

గంగూలీ సూపర్‌‌ సిరీస్‌‌ ప్రతిపాదన వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఐసీసీకి ఇండియా, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా నుంచే భారీ ఆదాయం సమకూరుతోంది. కానీ, ఈ దేశాలకు మెజారిటీ వాటా ఇచ్చేందుకు ఐసీసీ ససేమిరా అంటోంది. పైగా, ఏడాదికో ఇంటర్నేషనల్‌‌ టోర్నమెంట్‌‌ను నిర్వహించాలని ఇటీవల ప్రతిపాదించింది. దీన్ని బీసీసీఐతో పాటు ఈసీబీ, క్రికెట్‌‌ ఆస్ట్రేలియా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐసీసీకి కౌంటర్‌‌ ఇచ్చేందుకే దాదా నాలుగు దేశాల సిరీస్‌‌ను తెరపైకి తెచ్చాడని క్రికెట్‌‌ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌‌ సిరీస్‌‌ ద్వారా మూడు దేశాలకు భారీ ఆదాయం కూడా సమకూరనుంది. ఒకవేళ ఈ టోర్నీ కార్యరూపం దాల్చితే.. ఏడాదికో ఇంటర్నేషనల్‌‌ టోర్నీ నిర్వహించాలన్న ఐసీసీకి ఆ చాన్స్‌‌ కూడా ఉండబోదు. ఎందుకంటే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌‌కప్‌‌ జరగనుంది. 2021లో ఇండియాలో సూపర్‌‌ సిరీస్‌‌తో పాటు టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఉండనుంది. తర్వాతి ఏడాది ఇండియాలో సెకండ్‌‌ ఎడిషన్‌‌ సూపర్‌‌ సిరీస్‌‌ జరగనుంది. ఆపై, 2023లో వన్డే వరల్డ్‌‌కప్‌‌కు ఇండియానే ఆతిథ్యం ఇవ్వనుంది. 2024లో ఇంగ్లండ్‌‌లో ఐసీసీ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్స్‌‌ జరుగుతాయి. అయితే, ఐసీసీ అనుమతి లేకుండా సూపర్​ సిరీస్‌‌ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.

Latest Updates