వర్షం వచ్చినా మ్యాచ్ ఆగదు!: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మనదే

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లో రెడీ అయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని క్రికెట్ స్టేడియం రికార్డ్‌ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మోతేరా స్టేడియం బ్రేక్ చేసింది. మెల్‌బోర్న్ స్టేడియంలో లక్ష మంది కూర్చుని మ్యాచ్ చూడొచ్చు. మన మోతేరా స్టేడియంలో లక్షా పది వేల మంది ఒకేసారి మ్యాచ్‌ని ఆస్వాదించవచ్చు. ఈ నెల 24న భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని సందర్శించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రధాని మోడీ కలిసి భారీ సభను నిర్వహిస్తారు. దీంతో నిన్న అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ.

స్టేడియం విశేషాలు

ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరి మధ్య అక్కడ తొలి మ్యాచ్ జరగబోతోంది. భారత్ – ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. బౌన్సీ, స్పిన్, రెండూ మిక్స్డ్‌గా ఇలా అన్ని రకాల ప్లేయర్స్‌కి అనుకూలించేలా మూడు రకాల పిచ్‌లను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) తయారు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 11 రకాల పిచ్‌లను ఈ స్టేడియం కోసం రూపొందిస్తున్నట్లు సమాచారం.

కొన్ని పిచ్‌లు ఎర్ర మట్టితో, మరికొన్ని నల్లరేగడి మట్టితో, ఇంకొన్ని రెండింటినీ మిక్స్ చేసి తయారు చేస్తామని GCA వైస్ ప్రెసిడెంట్ ధన్‌రాజ్ నత్వానీ తెలిపారు. అవసరాన్ని బట్టి బౌన్సీ, స్పిన్ పిచ్‌లను రెడీ చేసుకుంటామన్నారు. ఈ స్టేడియానికి ప్రత్యేకమైన వరల్డ్ క్లాస్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం అరగంటలోనే వర్షపు నీటిని బయటకు పంపే కొత్త తరహా సబ్ సర్ఫేస్ డ్రైన్ సిస్టమ్ పెట్టినట్లు చెప్పారు. దీని వల్ల వర్షం పడినా మ్యాచ్ రద్దు కాకుండా ఉండే చాన్సెస్ ఎక్కువని స్పష్టం చేశారు.

Latest Updates