ఇయర్ ఫోన్స్ తో జర జాగ్రత్త

ఎక్కడ చూసినా జనం ఇయర్ ఫోన్స్ తోనే కనిపిస్తున్నారు. ట్రావెలింగ్, డ్రైవింగ్, ఆఫీస్‌‌, బాల్కనీ, పార్క్‌‌లు.. ఇలా ప్రతీ చోటా ఇయర్ ఫోన్స్ లేనిదే పనిజరగడం లేదు చాలామందికి. ముఖ్యంగా లాక్ డౌన్​లో వీటివాడకం మరింత పెరిగిందిది. ఆన్ లైన్ క్లాసెస్ కారణంగా పిల్లలంతా ఇప్పుడు ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ పెట్టుకునే క్లాసెస్ వింటున్నారు. టీచర్లు చెప్పేది క్లారిటీగా వినాలని ఎక్కువ సౌండ్ తో ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్​ చేసేవాళ్లు కూడా కచ్చితంగా ఇయర్ ఫోన్స్‌‌ వాడాల్సి వస్తుంది. దీంతో రోజూ గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. 

అవసరానికి మించి

అవసరం ఉండి ఇయర్ ఫోన్స్ ఉపయోగించేవాళ్లు కొందరైతే అవసరం లేకపోయినా యూజ్ చేసేవాళ్లు మరికొందరు. వీళ్లకు ఇయర్ ఫోన్స్ స్టైల్ సింబల్​గా మారింది. ఇయర్ ఫోన్స్ వాడకపోయినా వాటిని చెవులకు పెట్టుకుని తిరుగుతుంటారు. కొందరైతే పక్కవాళ్లకు కూడా వినబడేంత సౌండ్ పెట్టి మరీ ఇయర్ ఫోన్స్‌‌లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ట్రావెలింగ్ లో ఉన్నంత సేపూ పాటలు వింటూనే ఉంటారు. మరికొందరు డ్రైవింగ్ చేస్తూ కూడా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చెవులకు నేరుగా శబ్ధాలు చేరితే వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదమూ ఉంది.

చెవిపై ఎఫెక్ట్

అదే పనిగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నా.. ఎక్కువ సౌండ్‌‌తో వింటున్నా చెవిలోని నరాలపై ఆ ప్రభావం ఉంటుంది. చెవిలోపలుండే సున్నితమైన పొరలు పెద్ద పెద్ద శబ్ధాల వల్ల చిట్లిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చెవి నుంచి మెదడుకు వెళ్లే నరాలు దెబ్బతింటాయి. దీంతో వినికిడి శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒక్కోసారి పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ

చెవుల్లోపలి వరకూ ఉండే హెడ్ ఫోన్స్ వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా చెవుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. కొంతమంది చెవుల్లో అయితే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చెవుల్లో తలెత్తే వేడి, తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ల చెవుల్లో బ్యాక్టీరియా 7 రెట్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు చాలా స్టడీల్లో తేలింది. హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి చెవి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు వాడిన ఇయర్ ఫోన్ వేరేవాళ్లు వాడితే, ఆ ఇన్ఫెక్షన్ వేరేవాళ్లకు పాస్ అయ్యే అవకాశం ఉంది.

ఆల్టర్నేటివ్ ఏంటి?

ఇయర్ ఫోన్స్ ఎంత అవసరం ఉందో అంతే వాడటం మంచిది. ఒకవేళ రెగ్యులర్ గా వాడాల్సి వస్తే ఆరు నెలలకొకసారి ఇయర్ ఫోన్స్‌‌ను మారుస్తూ ఉండాలి. హెడ్ ఫోన్స్,ఇయర్​ బడ్స్‌‌లను శానిటైజ్ చేస్తూ ఉండాలి. ఇతరులకు హెడ్‌‌ఫోన్స్ ఎక్స్‌‌చేంజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. తక్కువ వాల్యూమ్ తో మ్యూజిక్ వినడం బెటర్. ఎక్కువసేపు ఇయర్ ఫోన్ వాడాల్సి వస్తే నాలుగు నిమిషాలకొకసారి బ్రేక్ తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకొకసారి పదిపదిహేను నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి.

ఇన్‌‌ఫెక్షన్స్‌‌ రావొచ్చు

ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల నష్టంలేదు. కానీ ఎక్కువగా వాడుతున్నా..ఎక్కువ వాల్యూమ్‌‌తో వింటుంటేనే ప్రమాదం. రోజులో ఎనిమిదిగంటల కంటే ఎక్కువ టైం పెద్ద వాల్యూమ్‌‌తో ఇయర్ ఫోన్ వాడితే చెవిలోపల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలు ఉన్నవాళ్లు స్పీకర్ ఫోన్ యూజ్ చేయాలి. రెండు ఇయర్ ఫోన్స్ కాకుండా ఒకటే ఇయర్ ఫోన్ వాడాలి. అప్పుడప్పుడు ఒక చెవికే కాకుండా అటుఇటు మారుస్తూ ఉండాలి. చెవుల్లో దురద, మంట వంటివి ఉన్నా, చెవుల నుంచి చీము కారుతున్నా వెంటనే డాక్టర్ ను కలవాలి. దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. చెవుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్‌‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్నదే అయితే డ్రాప్స్ ద్వారా నయం చేయొచ్చు. అందుకే సమస్య ఏదైనా ముందే అలర్ట్ అవ్వాలి. లేదంటే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.

– డా. ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్,

ఇఎన్‌‌టి సర్జరీ, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

Latest Updates