ఫ్రెండ్లీగా ఉంటోందని చంపేశారు

అదో చిన్న ఎలుగ్గొడ్డు. అమెరికాలోని అరేగాన్ పార్కులో ఉండేది. రోజూ అక్కడికి వచ్చే పర్యాటకులు దానికి చిరుతిళ్లు అలవాటు చేశారు. మెల్లిగా అది మనుషులకు అలవాటు పడింది. వాళ్లు వెంట తెచ్చుకున్న జంక్ ఫుడ్‌‌ను కూడా దానికి పెట్టడం మొదలుపెట్టారు. ఫలితంగా అది జనాలకు మరింత దగ్గరైంది. ఎంతలా అంటే దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నా ఏమీ అన లేదు. చక్కగా ఫోటోలకు పోజులిచ్చింది. ఇదే అరేగాన్ పార్కు పెద్దాఫీసర్లను ఆందోళనకు గురి చేసింది. జంక్ ఫుడ్ పెట్టడం వల్ల ఎలుగ్గొడ్డుల ఆరోగ్యం చెడిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయని, పొరబాటున అవి మనుషులపై దాడి చేస్తే పరిస్థితేంటనే ప్రశ్న ఎదురైంది. దాన్ని వేరే చోటుకు తరలించలేమని, మెర్సీకిల్లింగ్‌‌ మేలని కొందరు వన్యప్రాణి నిపుణులు పార్క్‌‌ అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా ఎలుగ్గొడ్డును తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని పార్కు యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. అయితే, దాన్ని చంపేయడంపట్ల జనం ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారుపై మండిపడుతున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వేరే ప్రాంతానికి తరలిస్తే సరిపోయేది కదా అని నిలదీశారు. దీనికి పార్కు ఆఫీసర్లు వైల్డ్ లైఫ్ నిపుణులు సూచించిన మార్గాన్ని ఫాలో అయ్యామని చెప్పారు. ఎలుగ్గొడ్డును చంపాల్సివచ్చినందుకు తాము చింతిస్తున్నామని తెలిపారు.

Latest Updates