జైశ్రీరాం అనలేదని ముస్లిం డ్రైవర్‌‌ను కొట్టిన్రు

  • రాజస్థాన్‌లో ఘటన
  •  దాడికి పాల్పడ్డ ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని సికార్‌‌లో దారుణం జరిగింది. ‘జైశ్రీరామ్‌’, ‘మోడీ జిందాబాద్‌’ అని అనలేదని ఒక ముస్లిం ఆటోడ్రైవర్‌‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సికార్‌‌లో ఆటో నడుపుకునే కచ్వా అనే 52 ఏండ్ల ఆటో డ్రైవర్‌‌ శుక్రవారం తెల్లవారుజామున ఎప్పటిలాగానే డ్యూటీకి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి సిగిరెట్‌ అడిగారు. సిగిరెట్‌ ఇస్తుండగా.. ‘జైశ్రీరామ్‌, మోడీ జిందాబాద్‌’ అనాలని ఒత్తిడి చేశారు. దానికి కచ్వా అంగీకరించకపోవడంతో అతడిని చితకబాదారు. కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వెంబడించి మరీ దాడి చేశారు. యవకులు దాడి చేయడంతో కుచ్వా ఎడమ కన్ను విపరీతంగా వాసింది. ఆయన పళ్లు ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాకుండా పాకిస్తాన్‌ వెళ్లిపోవాలని, పాక్‌కు వెళ్లే వరకు వదిలిపెట్టమని ఆ యువకులు వార్నింగ్‌ ఇచ్చారు. తన రిస్ట్‌వాచ్‌, డబ్బులు కూడా ఎత్తుకెళ్లారని కచ్వా పోలీసులకు కంప్లైంట్‌ చేయగా.. ఆ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

 

Latest Updates