పూటకోసారి తల నరుక్కుంటా అని మాట తప్పే సీఎం కేసీఆర్

ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతానని నాడు చెప్పిన మాట అబద్ధమంటుండు

కేసీఆర్ తప్పుడు ప్రచారం వల్లే శ్రీనివాస్ రెడ్డి ప్రాణం పోయింది

కార్మికులు జీతాల కోసం కొట్లాడుతున్నారని సీఎం అబద్ధాలు: కోదండ రామ్

జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ అబద్ధాల వల్లే ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ప్రాణం పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు జీతాల కోసం కొట్లాడుతున్నారని కేసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.50 వేల జీతాలు ఇస్తున్నామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనగామలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో పాల్గొని, వారికి మద్దుతు తెలిపారు కోదండరామ్.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ డిపోను తీసేసి మల్టిప్లెక్స్ సినిమా హాల్ కడతరేమోనని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ లాభాలతో నడిచే సంస్థ కాదని, ప్రభుత్వం భాధ్యతగా విలీనం చేయాలని సూచించారు. కార్మికుల సమస్యలపై జూన్ నెల నుంచి వివిధ రూపాల్లో తెలిపే ప్రయత్నం చేసినా కేసీఆర్ స్పందించలేని అన్నారు.

రాష్ట్రమంతా జేఏసీగా ఏర్పడింది

ఆర్టీసీ సమ్మెను ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం తమ సమస్యగా బావిస్తోందని, రాష్ట్రమంతా జేఏసీగా ఏర్పడి సమ్మె చేస్తున్నారని కేసీఆర్ ను హెచ్చరించారు కోదండరామ్.  పూటకోసారి తల నరుక్కుంటా అని మాట తప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. నాడు ఉద్యమ సంయంలో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని చెప్పిన విషయాన్ని కూడా తాను అనలేదని అంటున్నడని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులు కాజేయడమే కేసిఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రమంతా జేఏసీగా ఏర్పడి సమ్మె చేస్తున్నరని, ఈ నెల 19న తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కోదండరామ్.

Latest Updates